వక్రీకరణ రాతల్లో ఈనాడును కొట్టేవారు లేరు! రామోజీ అంతే.. అదో టైపు!

3 Jun, 2023 12:57 IST|Sakshi

ప్రసార మాద్యమాలలో అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేయడం ఎలా?.. అన్నది నేర్చుకోవాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పాలో అయితే సరిపోతుంది. ఒకప్పుడు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈనాడు పత్రికలో రాసుకునేవారు. కాని వారు అసలు హృదయం, ఆత్మ రెండూ లేకుండా రోజూ పచ్చి అబద్దాలను రాస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై విషం కక్కడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఉదాహరణకు.. 

✍️ బుధవారం నాడు ఈనాడులో వచ్చిన కధనం చూడండి. విజయవాడ మెట్రోకి ఉరి అని బానర్ కధనాన్ని ఇచ్చారు. ఆ వార్త మొత్తం చదివితే ఈనాడు రాతలు ఎంత విషపూరితమో, వికృతమో అర్ధం అయిపోతుంది.విజయవాడ నగరానికి మెట్రో రైలు వేసే అవకాశం పై పరిశీలన చేస్తామని కేంద్రం చెప్పింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు టైమ్ లోనే మెట్రో మాన్ గా పేరొందిన ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆయన పరిశీలన చేసి విజయవాడకు ఇది వయబలిటీ  కాదని స్పష్టం చేశారు.అయినా  చంద్రబాబు ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలను గమనించిన ఆయన చెప్పాపెట్టకుండా ఏపీ నుంచి వెళ్లిపోయారు.ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వమే  ఆ ప్రతిపాదనను మూలపడేసింది. అది నిజం.

ఒకవేళ విజయవాడకు మెట్రో రైలు అవసరం అని,  ఇప్పుడు హైదరాబాద్, చెన్నై,బెంగుళూరు లలో ఉన్నంత జనాభా లేకపోయినప్పటికీ, భవిష్యత్తులో పెరుగుతుందని ఈనాడు భావిస్తే తదనుగుణంగా వార్త ఇవ్వవచ్చు. లేదూ.. చంద్రబాబు పిలుపు  మేరకు ప్రజలు ఇక పిల్లలను ఎక్కువమంది కంటారని ఈనాడు రామోజీరావు అనుకుంటే కూడా ఆ విషయమే చెప్పవచ్చు. అవేమీ కాకుండా గుడ్డ కాల్చి మీద వేసినట్లుగా ఈనాడు చెత్త కధనాన్ని వండి వార్చింది. ఆ కథనంలో ఇంతకీ విషయం ఏమిటంటే ఎనికే పాడు వద్ద గత ప్రభుత్వ హయాంలో 2017లో  3,272 గజాల స్థలం సేకరణకు ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చారట. దానిని ఇప్పుడు రద్దు చేశారట!!.

✍️ చంద్రబాబు ప్రభుత్వం 2017లో ముసాయిదా జారీ చేస్తే మరి ఆ తర్వాత రెండేళ్లు ఆయనే అధికారంలో ఉన్నారు కదా!. మరి ఎందుకు భూ సేకరణ చేయకుండా వదలివేశారు?. ఆ సంగతి మాత్రం రాయరు. పోనీ ఆ ఒక్క చోట భూ సేకరణ చేస్తే మెట్రో వచ్చేస్తుందా? అలాగే శ్రీధరన్ కమిటీ చెప్పిన విషయాలను ప్రస్తావించరు. 2019లోనే ముసాయిదా నోటిఫికేషన్ గడువు ముగిసిందని, అయినా దానిపై తగు నిర్ణయం చేయకపోవడం వల్ల స్థల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, మళ్లీ అవసరమైతే సేకరిస్తామని జిల్లాకలెక్టర్ పేర్కొంటే దానిని వక్రీకరించి ఈనాడు ఈ వార్త ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ స్కీమ్ ఆగిపోతే ,దానిని జగన్‌కు అంటగట్టడమేమిటి?..   

✍️ విజయవాడ అంటే ఈ ప్రభుత్వానికి కక్ష అంటూ విద్వేషపూరిత కధనాన్ని ఇచ్చారు. విజయవాడలో  కీలకమైన బెంజ్ సర్కిల్‌లో రెండో వంతెనను ప్రారంభించి ఈ ప్రభుత్వం  సకాలంలో పూర్తి చేస్తే.. దానిని ఈ పత్రిక గుర్తించదు. అలాగే చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన కనకదుర్గమ్మ గుడి వద్ద వంతెను జగన్ ప్రభుత్వం పూర్తికావిస్తే.. దానికి క్రెడిట్ ఇవ్వరు. కృష్ణానదిలో ప్రజల రక్షణార్దం ఒక భారీ వాల్ నిర్మిస్తుంటే అది వీరికి కనిపించదు. పైగా గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను  ఆపివేయడం ,మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతీయడమే ప్రధాన ఎజెండాగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని నీచమైన వ్యాఖ్య చేశారు.

✍️ ఆ ప్రభుత్వం ఆరంభించిందేమిటి? వీళ్లు ఆపిందేమిటి? ఇలా రాసినవారు జర్నలిస్టులు అవుతారా? పార్టీ కార్యకర్తలు అవుతారా? రాజకీయపార్టీలవారు కూడా ఇంత ఘోరంగా అబద్దాలు చెప్పలేరేమో!. జార్ఖండ్ , ఒడిషాలలో కూడా మెట్రో ప్రతిపాదనలు లేవని, అవి వెనుకబడిన రాష్ట్రాలని ,వాటి సరసన ఏపీ చేర్చారని ఒక చెండాలపు కామెంట్. విజయవాడ కన్నా రాంచీ, భువనేశ్వర్ లు పెద్ద నగరాలు, అక్కడే ప్రాజెక్టు వయబిలిటి లేకపోతే ఇక్కడ ఎలా అవుతుందన్నది ప్రశ్న.

✍️ కోటి మంది ఉన్న హైదరాబాద్ లోనే మెట్రో భారీ నష్టాలను చవిచూస్తోంది.  తమకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని మెట్రో కోరుతోంది.  ఈ సంగతులు ఈనాడువారికి తెలియవా!. చంద్రబాబు అమరావతి రాజధాని అంటూ ప్రధాన రహదారికి నలభై కిలోమీటర్ల దూరంలో పల్లెటూళ్లలో ఎందుకు పెట్టారు?ఆయన ఏకంగా అమరావతికి రైలు, అదేదో గొట్టపు రైలు ప్రాజెక్టు అని, బులెట్ ట్రైన్ అని చాలా చెప్పారు కదా!. మరి వాటి గురించి ఈనాడు ఎప్పుడైనా రాసిందా? టీడీపీ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన భూ సేకరణ అంతా పూర్తి చేసిందా? అదేమీ జరగలేదే? ఒక్క ఎనికేపాడులో అది కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే. టిడిపి హయాంలోనే అది సాద్యం కాదని ప్రాజెక్టును పక్కనబెడితే, రాని ప్రాజెక్టు కోసం స్థల యజమానులు అటు భూమి లేక, ఇటు పరిహారం రాక ఇబ్బంది పడాలా?

✍️ ఈనాడు విలేకరి ఈ కథనంలో తన పైత్యం అంతా చూపించి చెత్త వార్తలు ఎలా రాయవచ్చో ప్రజలకు తెలియచేశారన్నమాట. ఈనాడు పత్రికలోనే అదే రోజు మార్గదర్శి ఆస్తుల అటాచ్ మెంట్ గురించి పెద్ద వివరణ ఇచ్చారు. వారు తమకు ఏ చట్టం వర్తించదని చెబుతున్నారు. తాము కార్పొరేట్ ఆఫీస్ కు తరలిస్తున్నది కంపెనీకి వచ్చే ఆదాయం అని బుకాయించే యత్నం చేసినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తు సెక్యూరిటీ కోసం చందాదారులు డిపాజిట్ చేస్తున్నారట. అసలు డిపాజిట్లే తీసుకోరాదని చట్టం చెబుతుంటే దానికి కొత్త భాష్యం. ప్రభుత్వ ఆర్ధిక ఆరాచకం అని నిత్యం రాసే ఈనాడువారు ముందుగా మార్గదర్శిలో అర్ధిక అరాచకం లేకుండా చూసుకుంటే మంచిది కదా!.  అలాగే వేరే వారి భూమి డ్రాప్ట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడాన్ని తప్పుపడుతున్న ఈనాడు.. మార్గదర్శి ఆస్తుల విషయంలో మాత్రం ఎవరూ చర్య తీసుకోకూడదని అంటోంది. ఇతరుల ఆస్తి ఏమైపోయినా ఫర్వాలేదు తమ ఆస్తుల జోలికి రావద్దని ఈనాడు అంటున్నట్లుగా ఉంది.  తమను ప్రశ్నించరాదని, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామని ఈనాడు రామోజీ చెప్పగలుగుతున్నారంటే అది ఆయనకే చెల్లుతుందనుకోవాలి.  


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్

మరిన్ని వార్తలు