రామోజీకి వణుకు.. అసలు కథ ముందుంది?

28 Feb, 2024 13:24 IST|Sakshi

వృద్ధాప్యంలో ఉన్న ఈనాడు మీడియా యజమాని రామోజీరావుకు పెద్ద సవాలే ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవని ఆయన భయపడుతున్నారనిపిస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఇష్టారాజ్యంగా నడిపారు. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని మీడియా రాజ్యాన్ని సృష్టించారు.

ఆ మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారంలో తనకు ఎదురులేదన్నట్లుగా ప్రవర్తించారు. కానీ, సీఎం జగన్‌ రూపంలో తనకు ఇంత ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన ఊహించలేకపోయారు. తన మార్గదర్శి సంస్థలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిని, నల్లధనం తదితర విషయాలన్నిటినీ ఏపీ సీఐడీ బహిర్గతం చేసింది. దాంతో సీఎం జగన్‌పై కక్ష కట్టిన రామోజీ ఇప్పుడు తన మీడియాను పూర్తి స్థాయిలో టీడీపీ కరపత్రంగా, బాకాగా మార్చేశారు. ఈసారి ముఖ్యమంత్రి జగన్‌ పోటీ పడుతున్నది చంద్రబాబు కాదని, రామోజీరావు అని అంతా భావించే దశకు వెళ్లారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని, ఎవరో ఒకరు తగులుతారని అంటారు. అలాగే రామోజీ సంస్థలలోని ఆర్దిక అరాచకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కనిపెట్టింది. తత్ఫలితంగా ఆయన ప్రతిష్ట మసకబాసింది. దాంతో ఆయనకు సీఎం జగన్‌పై ఎక్కడ లేని ద్వేషం ఏర్పడింది.

నిజానికి సీఎం జగన్‌పై రామోజీరావుకు ఉన్న పగ ఈనాటిది కాదు. ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ నుంచే రామోజీ బొడ్డుకు సున్నం రాసుకున్నట్లు వ్యవహరించేవారు. దానికి కారణం అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనను రాజగురువుగా భావించి, నిత్యం సంప్రదింపులు చేస్తూ ఆయనను సంతృప్తిపరుస్తుండేవారు. 1989-1994 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో మరీ ఈ స్థాయిలో గొడవపడేవారు కారు. వారు కూడా చూసి చూడనట్లు పోతుండేవారు. రామోజీ మీడియాకు వారు కొంత భయపడేవారు. 1994లో ఎన్.టి.రామారావు అంత మెజార్టీతో అధికారంలోకి వస్తారని రామోజీ ఊహించలేదు. అయినా ఎన్‌టీఆర్‌ భారీ ఆధిక్యతతో అదికారంలోకి రావడంతో కొద్దికాలం సర్దిపెట్టుకున్నారు. కానీ, ఆ తర్వాత పరిణామాలలో ఎన్‌టీఆర్‌ రెండో భార్య లక్ష్మీపార్వతిని సాకుగా చూపుతూ ఆయనను దారుణంగా చిత్రీకరిస్తూ వ్యంగ్య కార్టూన్లు వేయించేవారు. చంద్రబాబుకు కొమ్ముకాసి ఎన్‌టీఆర్‌ను దించడంలో రామోజీ తనదైన పాత్రను పోషించారు.

అప్పటి నుంచి తానే షాడో ముఖ్యమంత్రి అన్నట్లు సంతోషపడుతుండేవారు. ఆయనకు ప్రభుత్వపరంగా ఏది కావాలన్నా ఎదురులేని పరిస్థితి సృష్టించుకున్నారు. ఆ పరిస్థితిలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని ఓడించి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎందువల్లో వైఎస్ పట్ల మొదటి నుంచి అంత సానుకూలంగా ఉండేవారు కాదు. అయినా వైఎ‍స్సార్‌ పెద్దగా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోయేవారు. కాకపోతే ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేసేవారు. వాటికి పోటీగా కాంగ్రెస్‌కు కూడా ఒక పత్రిక ఉండాలని, ఒక టీవీ ఉండాలని తలపోశారు. అందుకు అనుగుణంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. అది రామోజీకి పుండుమీద కారం చల్లినట్లయింది.

తన మీడియాకే పోటీకి వస్తారా అన్న అహంభావంతో వైఎస్ ప్రభుత్వంపై చెలరేగడం ఆరంభించారు. చివరికి సీఎంగా ఉన్న వైఎస్సార్‌పై ఒక సంపాదకీయం రాస్తూ ‘ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే’ అంటూ హెడింగ్ పెట్టి వైఎస్‌ను ఘోరంగా అవమానించారు. అదే తరుణంలో రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌తో జరుగుతున్న అక్రమ డిపాజిట్ల సేకరణపై అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణకుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో రివర్స్ కథ మొదలైంది.

రామోజీ అంతవరకు తాను ఏమీ తప్పు చేయడం లేదన్నట్లుగా ప్రజల దృష్టిలో పడుతూ, మరోవైపు అక్రమంగా డిపాజట్ల సేకరణకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో ఉండవల్లి సఫలం అయ్యారు. అయితే, తీసుకున్న డిపాజిట్లను రామోజీ సకాలంగా చెల్లిస్తున్నారుగా అన్న ప్రచారం జరిగేది. కానీ, అసలు డిపాజిట్లు సేకరించడమే అక్రమమని, నేరమని ఆర్‌బీఐ ప్రకటించడంతో రామోజీ తన టీవీ చానళ్లు కొన్నిటిని విక్రయించి సుమారు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి చెల్లించవలసి వచ్చింది. అది ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది.

2009లో రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ కేసుకు బ్రేక్ పడింది. ఆయన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలు రామోజీతో రాజీపడిపోయారు. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రామోజీ స్నేహం చేస్తూ, కాదు.. కాదు... భజన చేస్తూ.. తన ఆస్తులవైపు, తన సంస్థల లావాదేవీల వైపు రాకుండా చూసుకోగలిగారు. అదే సమయంలో విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది.

చంద్రబాబును భుజాన వేసుకుని వైఎస్ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి యువకుడు అన్న ఆలోచన కూడా లేకుండా దాడి ఆరంభించారు. సోనియాగాంధీ, చంద్రబాబులకు రామోజీ తోడై సీబీఐ పెట్టిన అక్రమ కేసులపై తన మీడియా ద్వారా విపరీత వ్యతిరేక ప్రచారం చేసేవారు. అయినా.. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం వీరిని పట్టించుకునేవారుకారు. 2014 ఎన్నికలలో రామోజీ మీడియా చేసిన అబద్దపు ప్రచారం కొంత పనిచేసింది. కారణం ఏమైనా జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాలేకపోయారు. అయినా ఆయన పట్టువదలకుండా రాజకీయాలు నడిపారు. అది ఈనాడుకు నచ్చలేదు. జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీశాం కదా అనుకుంటే మళ్లీ కెరటంలా లేస్తున్నారని గమనించారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్‌మోహన్‌రెడ్డిపై దారుణమైన కథనాలు అల్లారు. కానీ, జనం నమ్మలేదు. రామోజీ రాతలను ఖాతరు చేయకుండా ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్‌కు పట్టం కట్టారు. అప్పటి నుంచి మళ్లీ రామోజీలో అసూయ పెరిగింది.

జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనపై దాడి ఆరంభించారు. కొంతకాలం ఓపికగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేచి చూసింది. అయినా రామోజీ తన వైఖరిని మార్చుకోకుండా, ఈనాడు మీడియాను టీడీపీ ప్రచార బాకాగా వాడడం ఆరంభించారు. అంతవరకు అయితే ఫర్వాలేదు. సీఎం జగన్‌పై ఉన్నవి, లేనివి కలిపి పచ్చి అబద్దాలు రాయడం ఆరంభించారు. ఈ దశలో మార్గదర్శి చిట్స్‌లో జరిగిన అక్రమాలు, అక్రమ డిపాజిట్ల వసూలు కొనసాగించడం సీఐడీ దృష్టికి వెళ్లి, వారు రంగంలో దిగారు. దాంతో ఒక్కసారిగా రామోజీ బిత్తరపోయారు.

తాను ఎవరికి దొరకనని, ఎవరూ తన జోలికి రావడానికి సాహసం చేయరని అనుకునే రామోజీరావుకు ముఖ్యమంత్రి జగన్‌ రూపంలో సవాల్ ఎదురైంది. మార్గదర్శి చిట్స్‌లో సభ్యుల చేరిక మొదలు, చిట్టీలు పాడుకున్నవారికి సకాలంలో చెల్లించకపోవడం, డిపాజిట్ల అక్రమ సేకరణ, నల్లధనం చలామణి మొదలైనవాటిని ఏపీ సీఐడీ కనిపెట్టడంతో రామోజీకి సినిమా మొదలైంది. చివరికి ఆయన సీఐడీ అధికారుల విచారణను ఎదుర్కున్నారు. అప్పటికీ న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పట్టుతో ఈ కేసులన్నీ వేగంగా సాగకుండా అడ్డుపడుతున్నారు.

ఏపీ కేసులకు కూడా తెలంగాణ హైకోర్టులో స్టేలు తెచ్చుకుని తప్పించుకోచూస్తున్నారు. మార్గదర్శి చిట్స్‌లో సుమారు 800కోట్ల నల్లధనం లావాదేవీలు జరిగాయని సీఐడీ గుర్తించింది. చిట్స్‌ నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించడంతో ఏపీలో సంస్థ బ్రాంచ్‌లలో వ్యాపారం స్తంభించడం ఆరంభమైంది. టర్నోవర్‌పై దాని ప్రభావం పడింది. తాజాగా సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం చిట్స్‌రూపేణా కాని, అక్రమ డిపాజిట్ల రశీదుల రూపేణా కాని  సుమారు 4800 కోట్ల రూపాయల మేర బకాయిలు పడ్డారని అధికారులు అంచనా వేసినట్లు  రావడం సంచలనాత్మకంగా మారింది.

రామోజీ మరీ రెచ్చిపోయి, బరితెగించి వైఎస్ ప్రభుత్వంపై ఎందుకు ఇంత నీచంగా వార్తలు రాస్తున్నారు అని ఆలోచించేవారికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. తన వ్యాపార లావాదేవీల అరాచకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం బహిర్గతం చేసిందన్న కోపం ఒకవైపు, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, తన ఆట కట్టినట్లే అవుతుందన్న భయం మరోవైపు రామోజీ బృందాన్ని వేటాడుతున్నాయి. దాంతో ఈనాడు మీడియాను పణంగా పెట్టి ముఖ్యమంత్రి జగన్‌పై విపరీతమైన ధోరణిలో విష ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు అదికారంలోకి వస్తే ఈ కేసులేవీ ముందుకు సాగవు అన్న భావన. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకన్నా, రామోజీకే అతి పెద్ద సవాలుగా మారాయనిపిస్తుంది. అంతే తప్ప తనపై వచ్చిన కథనాలకు సమాధానం ఇవ్వడానికి, మార్గదర్శిలో జరిగిన అవకతవకలకు సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎం జగన్‌ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ఆయన మార్గంగా ఎంచుకున్నారు.

నిజానికి జర్నలిజంలో ఒక సూత్రం ఉంది. తన సొంత వ్యాపార ప్రయోజనాలకోసం మీడియాను అడ్డు పెట్టుకోరాదు. ఆ పరిస్థితిని మనం ఆశించలేకపోయినా, ఒక రాజకీయ పార్టీని అనైతికంగా భుజాన వేసుకుని రామోజీ తన మీడియాను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు రాస్తూ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ సైతాన్ మాదిరి ప్రవర్తిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. అయినా ఈ విమర్శలన్నిటి కన్నా తన సంస్థపై వచ్చిన కేసులను కప్పిపుచ్చుకోవడానికి గాను ఆయన తన మీడియాను ఫణంగా పెట్టి మరీ దుష్ప్రచారం సాగిస్తున్నారని చెప్పాలి. అందుకే టీడీపీ గెలుపు చంద్రబాబుకన్నా, రామోజీకే ఎక్కువ అవసరంగా మారింది. అయినా ఆయన ఆశలు నెరవేరే సూచనలు కన్పించడం లేదు!


-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

whatsapp channel

మరిన్ని వార్తలు