మీనింగ్‌లెస్‌.. ఎప్పుడూ పాచికబుర్లే.. చంద్రబాబు అందులో దిట్ట

20 Dec, 2023 12:19 IST|Sakshi

నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నది రాజకీయాలలో బాగా వర్తిస్తుందేమో! ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన చూస్తే అంతా ఆశ్చర్యపోవల్సిందే. అఫ్ కోర్సు .. అది ఆయనకు అలవాటే అనుకోండి. తాను చేసే తప్పులను ఎదుటివారిమీద రుద్దడంలో ఆయన దిట్ట. సామాజిక న్యాయంపై చిత్తశుద్ది ఉంటే ముఖ్యమంత్రి జగన్  పులివెందుల నుంచి బిసి అభ్యర్ధిని నిలబెట్టాలని  చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారట. దీనిని ఈనాడు వంటి ఎల్లో మీడియా చాలా గొప్ప విషయంగా ప్రచారం చేసింది. ఆయన చాలా చిత్తశుద్దితో చెప్పారని అనుకుందాం. అలాగైతే ముందుగా ఆయన ఏమి చేసి ఉండాల్సిందంటే..

✍️తాను కుప్పం నుంచి ఈసారి పోటీ చేయబోవడం లేదని చెప్పి ఉండాలి. లేదా ఇంతకాలం బిసి వర్గాలకు చెందిన కుప్పం నియోజజకవర్గంలో తాను ప్రాతినిద్యం వహిస్తున్నందుకు మన్నించాలని ప్రజలను కోరి ఉండాల్సింది. అవేమి చేయలేదు. ఇక్కడ ఒక సందేహం కూడా ఉంది. ఈసారి కుప్పం నుంచి పోటీచేసి గెలుస్తామో, లేమోనన్న అనుమానంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోవడానికి గాను కొత్త ప్లాన్ వేసి ఇలా మాట్లాడుతున్నారా అన్నది ఆ డౌట్. కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో చివర ఉంటుంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దున ఉంటుంది. అక్కడ నివసించేది అత్యధికం వన్నియార్ క్షత్రియ, గాండ్ల తదితర వెనుకబడిన తరగతులవారు .కుప్పం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నాలుగు ఎన్నికలలో డి.రామబ్రహ్మం,ఎపివి చెట్టి, డి.వెంకటేశం అనే   బిసి వర్గాల నేతలే  ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. 

✍️1978 లో తొలిసారి దొరస్వామినాయుడు అనే కమ్మ వర్గం  నేత కాంగ్రెస్ ఐపక్షాన ఎన్నికయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీ కూడా కమ్మ సామాజికవర్గానికే చెందిన రంగస్వామి నాయుడుకు సీటు ఇచ్చింది. ఆయన రెండుసార్లు గెలిచారు. కుప్పంలో ఎక్కువ మంది ఎన్.టి.ఆర్.అభిమానులు ఉండడమే దీనికి కారణం.1989 లో చంద్రబాబు నాయుడు ఆ సీటుపై కన్నేశారు. తొలుత ఆయన సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. కాని 1983లో టిడిపి చేతిలో  పరాజయం పాలయ్యారు.ఆ వెంటనే తన మామ ,టిడిపి అధినేత ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి కావడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిడిపిలోకి వచ్చేశారు. 1985లో ఆయన పోటీచేయలేదు. కాని ఆ సమయంలో ఏది తనకు సురక్షిత నియోజకవర్గమో ఆలోచించి కుప్పం ను ఎంపిక చేసుకున్నారు. టిక్కెట్ ఇచ్చేది తన మామే కనుక ఆయన వెంటనే రంగస్వామి నాయుడిని తప్పించి తాను అక్కడ నుంచి 1989లో బరిలో దిగారు. 

✍️అప్పటి నుంచి వరసగా ఆయన ఏడుసార్లు గెలిచారు. అంటే తద్వారా ఏడుసార్లు ఆయన బిసి నేతలకు అవకాశం లేకుండా  చేశారన్నమాట. ఆ సంగతిని ఆయన చెప్పకుండా ముఖ్యమంత్రి జగన్ కు ఏదో సవాల్ చేశారట. పులివెందుల నియోజకవర్గం లో  1978 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం వారే ఎన్నికవుతూ వస్తున్నారు. వారికి అది స్వస్థలం కూడా. చంద్రబాబు స్వస్థలం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారి పల్లె. ఆయన వచ్చేసారి సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి పోటీచేస్తానని ప్రకటించి ఉంటే అదో పద్దతి. అలా చేయకపోగా, ఎదురు డబాయింపు. ఎన్నికల సమయంలో బిసి జపం చేయడం, ఆ తర్వాత వదలివేయడం టిడిపికి మామూలే. 

✍️నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి దేవాలయం వంటి సెక్రటేరియట్ కు వస్తారా అని ప్రశ్నించిన చరిత్ర  చంద్రబాబుది. మత్సకారులను తోకలు కట్ చేస్తా నంటూ బెదిరించిన విషయం కొత్తదేమి కాదు.23 మంది వైసిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఆయన మంత్రి పదవులు మాత్రం వారిలో ఉన్న బలహీనవర్గాలకు ఇవ్వలేదు. ముగ్గురు రెడ్డి, ఒక వెలమ సామాజికవర్గం వారికి ఇచ్చారు.దాని గురించి ఏమి చెబుతారు? అంతెందుకు 2014లో మంళగిరిలో బిసి నేత చిరంజీవికి  టిడిపి టిక్కెట్ ఇచ్చారు కదా! 2019 లో ఆయనను అక్కడ నుంచి తప్పించి , ఆ టిక్కెట్ తన కుమారుడు లోకేష్ ఎందుకు ఇచ్చుకున్నారు? బిసిలపై ప్రేమ ఉంటే అలా చేయవచ్చా? విజయవాడ తూర్పు,పెనమలూరులేదా మరో కమ్మ సామాజికవర్గం నేతలు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని ఎందుకు ఎంపిక చేసుకోలేదు.

✍️ మంళగిరిలో లోకేష్ ఓడిపోయారు. అది వేరే విషయం. ఒక వేలు ఎదుటివారిపై చూపేటప్పుడు తమవైపు నాలుగు వేళ్లు చూస్తాయన్న సంగతి గుర్తుంచుకోవాలి కదా! ఎస్సి ఎమ్మెల్యేల సీట్లను మార్చుతారా అంటూ వైసిపిని ప్రశ్నించడంలో హేతుబద్దత ఏమిటో తెలియదు. గత ఎన్నికలలో ఎంతమంది ఎస్సి నేతల సీట్లు చంద్రబాబు మార్చలేదు!వంగలపూడి అనిత,కెఎస్ జవహర్,స్వామిదాస్ వంటి ఎస్సి నేతలను ఆయా నియోజకవర్గాల నుంచి మార్చింది చంద్రబాబు కాదా!  దానిని పక్కనబెడదాం. తాడికొండలో వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టిడిపిలో చేర్చుకున్నారు కదా! ఆమెకు టిక్కెట్ ఇస్తారా?లేదా? ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రావణ్ కుమార్ కు ఇస్తారా?ఇవ్వరా?చంద్రబాబు థియరీ ప్రకారం అయితే టిడిపి టిక్కెట్ శ్రీదేవికే ఇవ్వాలి. 

✍️అలాగే ఉదయగిరి టిక్కెట్ మేకపాటి చంద్రశేఖరరెడ్డికి ఇవ్వాలి. అందుకు చంద్రబాబు సిద్దపడతారా? మరో విషయం చెప్పాలి. చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెగ రాసిన ఈనాడు మీడియా ఇప్పుడు మాత్రం కిక్కురుమనడం లేదు! ముఖ్యమంత్రి జగన్ మొదటి నుంచి బిసిలంటే  బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని చెబుతూ వారు  సమాజానికి వెన్నుముఖ వంటివారని బాక్ బోన్ తో పోల్చుతుంటారు. తన మంత్రివర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పదకుండు మంది బిసి వర్గాలవారికి మంత్రి పదవులు ఇచ్చారు. వీరితోపాటు ఎస్సి, ఎస్టి,మైనార్టీ వర్గాలతో కలిపి మొత్తం 17 మందికి మంత్రి పదవులు ఇవ్వడం విశేషం. 

✍️బిసిలకు కులాలవారీగా 56 కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి వారికి చైర్మన్ ,డైరెక్టర్ తదితర పదువులు కట్టబెట్టడం ద్వారా ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి ప్రయత్నించింది జగన్. జగన్ సామాజిక సాధికార బస్ యాత్రలు సఫలం అవుతుండడంతో చంద్రబాబు ఇలాంటి పిచ్చి సవాళ్లు విసురుతున్నారు. దానికి ఈనాడు వంటి ఎల్లో మీడియా బాండ్ వాయిస్తుంటుంది. పోలీసులు లేకపోతే వైసిపివాళ్లు రోడ్డు మీదకు రాగలరా అని ఆయన మరో చిత్రమైన ప్రశ్న వేశారు. తన చుట్టూ వంద మంది పోలీసులను పెట్టుకుని తిరిగే చంద్రబాబు నాయుడు వేయవలసిన ప్రశ్నేనా ఇది. పైగా జాతీయ స్థాయి భద్రత దళం తో సెక్యురిటీ పెట్టుకున్నారే!ఆయన సరే! చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎలాంటి భద్రత లేకుండా రోడ్లపై తిరుగుతున్నారా! చేసే విమర్శకన్నా అర్ధం ఉండాలి.

✍️ పాచి పనులకు పక్క రాష్ట్రాలకు పోవల్సిన పరిస్థితి ఉందని ఆయన అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆంద్రులను అవమానించడం ఏ మాత్రం పద్దతిగా లేదు. నలభైఐదేళ్ల రాజకీయ అనుభవం, పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు అనడానికి సిగ్గుపడాలి. నిజంగానే ఆ పరిస్థితి ఉంటే ఆయనకు బాధ్యత లేదా! ఇప్పటికీ కుప్పం నుంచి రోజూ వేలాది మంది రైళ్లలో బెంగుళూరు వెళ్లి పనులు చేసుకుంటారట. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఉద్యోగాలు కల్పించడానికి ఏమి చేశారు?అదే జగన్ అయితే పులివెందుల చుట్టూరా అనేక పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశాలు పెంపొదిస్తున్నారు.

✍️రాష్ట్ర వ్యాప్తంగా పలు అబివృద్ది పనులు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, కొత్త పరిశ్రమలు తెస్తూ ప్రగతికి బాటలు వేస్తుంటే ఈయనేమో ఇంకా పాచి విమర్శలతోనే జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టిడిపి-జనసేన పొత్తు అట! వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని అంటారు. అలాగే తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతోందని భయపడి చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ , దత్తపుత్రుడుగా పేరొందిన పవన్ కల్యాణ్ లు ఇలా రాష్ట్రం కోసం పొత్తు అని చెబితే వినడానికి ప్రజలు చెవిలో పూలు పెట్టుకున్నారా!. 


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

whatsapp channel

మరిన్ని వార్తలు