20 ఏళ్లుగా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు: ధన్‌కర్‌కు మోదీ ఫోన్‌

20 Dec, 2023 12:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు ప్రధానమం‍త్రి నరేంద్ర మోదీ బుధవారం ఫోన్‌ చేశారు. ఈ విషయాన్ని ధన్‌కర్‌ స్వయంగా  ఎక్స్‌ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. మంగళవారం పార్ల‌మెంట్‌లో జ‌రిగిన ఘ‌ట‌న విషయంపై ప్రధాని ఆవేదన వ్య‌క్తం చేశారు. ఉప రాష్ట్రపతిలాంటి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని, అది కూడా పార్లమెంట్‌లో విపక్షాల ఎంపీలు ఇలా అవమానించడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఆయన ఇలాంటి అవ‌మానాలకు గురవుతున్నారని చెప్పినట్లు తెలిపారు.

అయితే కొం‍తమంది ప్రవర్తన తన కర్తవ్యాన్ని నిర్వర్తించడకుండా అడ్డుకోలేవని ధన్‌కర్‌ వెల్లడించారు. ఎన్ని అవ‌మానాలు ఎదురైనా తాను మాత్రం క‌ట్టుబ‌డి ప‌ని చేస్తాన‌ని తెలిపారు. తన హృదయపూర్వకంగా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉన్నానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరని పేర్కొన్నారు. ఇక ప్రధానితోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ వ్యక్తీకరణ గౌరవంగా ప్రవర్తించాలని హితవు పలికారు.

కాగా మంగళవారం  స‌స్పెండ్ అయిన పార్ల‌మెంట్ విప‌క్ష స‌భ్యులు సస్పెన్షన్‌ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ..  రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌కర్‌ మిమిక్రీ చేశారు.  పార్లమెంట్‌ మెట్ల వ‌ద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జ‌గ‌దీప్‌ను అనుకరిస్తూ ఎగతాళి చేశారు. ఈ మిమిక్రీ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  దీనిపై స్పందించిన ధన్‌కర్‌.. రాజ్యసభలో తనపట్ల జరిగిన సంఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించారు. 

మరోవైపు ‘ఎంపీల సస్పెన్షన్​’ వివాదం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. పార్లమెంట్‌లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింస్తున్నందుకు ఇప్పటి వరకు రాజ్యసభ, లోక్‌సభలోని విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇక ఎంపీల సస్పెన్షన్​పై ప్రతిపక్షాలు తమ నిరసనలను తీవ్రం చేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు