బాధతో పార్టీని వీడుతున్నా.. 

3 Oct, 2023 03:32 IST|Sakshi

మల్కాజిగిరి కాంగ్రెస్‌ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ రాజీనామా 

మైనంపల్లి చేరికతో... టికెట్‌ రాదని నిర్ణయం 

రేవంత్‌రెడ్డికి షాక్‌.. బీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం! 

సాక్షి, మేడ్చల్‌ జిల్లా:/అల్వాల్‌: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్‌ ద్వారా పంపినట్లు తెలిపారు. అల్వాల్‌లోని ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాననీ, మల్కాజిగిరిలో పార్టీ కోసం పని చేస్తూ ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుతో విభేదించిన సందర్భంగా పలు కేసులు నమోదు అయ్యాయన్నారు.

బీఆర్‌ఎస్‌లో తన కొడుకుకు టికెట్‌ రాకపోవడంతో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరారని ఈ క్రమంలో తనకు మల్కాజిగిరిలో పార్టీ టికెట్‌ ఇవ్వలేమన్న సంకేతాలు రావడం బాధించాయన్నారు. బీసీలకు అన్ని పార్టీలకన్నా అధిక సీట్లు ఇస్తామని ప్రకటించిన నాయకులు తన మాదిరిగా వెనుకబడిన తరగతి నుండి వచ్చిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వకపోవడం చూస్తుంటే బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. 

రేవంత్‌రెడ్డికి దెబ్బే.. 
శ్రీధర్‌ రాజీనామాతో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డికి గట్టి షాక్‌ తగిలినట్లయింది. రేవంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం మేడ్చల్‌ జిల్లా పరిధిలో ఉండటం గమనార్హం. సొంత నియోజకవర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని కాపాడుకోలేని రేవంత్‌ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని ఏవిధంగా అధికారంలోకి తీసుకు రాగలరన్న ప్రశ్నలు స్థానికంగా పార్టీ శ్రేణుల నుంచి తలెత్తుతున్నాయి. కాగా శ్రీధర్‌ బీఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు