తోడు దొంగల ‘రింగ్‌’! | Sakshi
Sakshi News home page

తోడు దొంగల ‘రింగ్‌’!

Published Tue, Oct 3 2023 3:29 AM

Chandrababu, Lokesh and Narayana robbery on Inner Ring Road - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో అమరావతి భూదోపిడీ పర్వంలో కీలకమైన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డే లేదు..! మాకేం తెలియదంటూ చంద్రబాబు, నారా­యణ, లోకేశ్‌ బృందం ఎంత బుకాయిస్తున్నా అక్ర­మాలు ఒక్కొక్కటిగాబయటపడుతున్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ గురించి తమకు ముందుగా ఏమాత్రం తెలియదన్న వారి వాదనలో నిజం లేదని తేలిపోయింది. రైతులు, ఇతరుల ప్రయోజ­నా­­లను దెబ్బ తీయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజె­క్టును కూడా అటకెక్కించినట్లు బహిర్గతమైంది.

తమ భూముల ధరలు భారీగా పెరిగేలా..
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ లబ్ధికి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ పక్కా ప్రణాళిక రచించారు. హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును నిర్మించేలా అలైన్‌మెంట్‌లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేశారు.

అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము ముందస్తుగానే ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరచాలని షరతు విధించారు.  అప్పటికే తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించుకున్నారు. తద్వారా అటు అమరావతి సీడ్‌ క్యాపిటల్‌ పరిధిలో ఇటు నదికి అవతల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా కుట్ర పన్నారు. 

నారాయణ హెచ్చరికలతో..
వాస్తవానికి సీఆర్‌డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం ఇన్నర్‌రింగ్‌ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లాలోని పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప నుంచి ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కొనసాగాలి. అయితే అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో ఈ అలైన్‌మెంట్‌పై సీఆర్‌డీఏ అధికారులపై నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

సీఆర్‌డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్‌మెంట్‌ మార్చాలని ఆదేశించారు. దీంతో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దాని ప్రకారం గుంటూరు జిల్లాలోని రామచంద్రాపురం – కృష్ణా జిల్లాలోని చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడ నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును నిర్మిస్తారు. నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని వెళ్లేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. 

ఏడాది ముందుగానే లే అవుట్లకు ‘నో’
అసలు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటించటానికి ఏడాది ముందు నుంచే ఆ ప్రాంతంలో లే అవుట్లకు సీఆర్‌డీఏ అనుమతులను తిరస్కరించడం గమనార్హం. అంటే అలైన్‌మెంట్‌ మార్పుపై పక్కా సమాచారంతోనే ఈ వ్యవహారం సాగినట్లు స్పష్టమవుతోంది. అక్కడ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వెళ్తుందని తెలియని సాధారణ వ్యక్తులు, పలువురు ప్రైవేట్‌ రియల్టర్లు లే అవుట్ల కోసం సీఆర్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నారు.

అంతేకాకుండా ఆ ప్రాంతంలో ప్రధాన కార్యాలయాల భవనాలను నిర్మించేందుకు కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఆ లే అవుట్లు, భవన నిర్మాణాల దరఖాస్తులను సీఆర్‌డీఏ తిరస్కరించింది. అప్పటికి ఆ ప్రాంతంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని అధికారికంగా ప్రకటించలేదు. అధికారికంగా అమరావతి మాస్టర్‌ప్లాన్‌ కూడా ఖరారు లేదు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు అనుమతులను టీడీపీ సర్కారు తిరస్కరించింది.

వ్యవసాయ భూముల వినియోగ మార్పిడి ద్వారా లే అవుట్ల కోసం అందిన 29 దరఖాస్తులతోపాటు ప్రతిపాదిత రింగు రోడ్డుకు చేరువలోని 70 లే అవుట్లకు అనుమతులను తిరస్కరించినట్లు సిట్‌ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భవన నిర్మాణ అనుమతులను సైతం తిరస్కరించారు. అంటే మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు ఆ ప్రాంతంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, అలైన్‌మెంట్‌పై ముందుగానే కచ్చితమైన సమాచారం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

‘రింగు’ కోసం బైపాస్‌కు బైబై..
తమ భూముల ధరలు పెరిగితే చాలు.. ప్రజా ప్రయోజనాలు తమకు ఏమాత్రం పట్టవని చంద్రబాబు, నారాయణ ద్వయం నిరూపించింది. విజయవాడ నగరంపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తూ చెన్నై–కోల్‌కత్తా జాతీయ రహదారిపై ప్రయాణాన్ని మరింత సరళతరం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ  ప్రణాళికను ఖరారు చేశారు. గుండుగొలను నుంచి విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం మండలాల నుంచి కృష్ణా నది మీదుగా గుంటూరు జిల్లా కాజా వరకు విజయవాడ పశ్చిమ బైపాస్‌ను నిర్మించాలని నిర్ణయించారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మించే ఈ రహదారి కోసం భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశారు.

వైఎస్సార్‌ హఠాన్మరణం తరువాత ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత ఎన్‌హెచ్‌ఏఐ పనులు ప్రారంభించినా చంద్రబాబు ప్రభుత్వం అందుకు ఏమాత్రం సహకరించ లేదు. విజయవాడ పశ్చిమ బైపాస్‌ నిర్మాణం పూర్తయితే ఇక ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాల్సిన అవసరమే ఉండదు. అదే జరిగితే తమ భూముల ధరలు అడ్డగోలుగా పెంచుకునేందుకు అవకాశం ఉండదని చంద్రబాబు, నారాయణ ఆందోళన చెందారు. దీంతో విజయవాడ పశ్చిమ బైపాస్‌ రోడ్డు పనులకు అడ్డు పడ్డారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆ పనులు ఏమాత్రం ముందుకు సాగకపోవడమే ఇందుకు నిదర్శనం.

త్వరలో ప్రారంభానికి సన్నాహాలు
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ పశ్చిమ బైపాస్‌ పనులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టు పనులకు అవరోధాలు తొలగిపోయేలా చర్యలు తీసుకున్నారు. భూసేకరణ, ఇతర అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరం పరిష్కరించడంతో రూ.3,200 కోట్ల విలువైన విజయవాడ పశ్చిమ బైపాస్‌ పనులు తుదిదశలో ఉన్నాయి.

ప్రస్తుతం దాదాపు 90 శాతం పనులు పూర్తి కావడం విశేషం. సుమారు 50 కి.మీ పొడవైన ఈ ఆరు లేన్ల బైపాస్‌ను త్వరలోనే ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రజా ప్రయోజనకరమైన ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు సర్కారు అడ్డుకోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శర వేగంగా పూర్తి చేస్తుండటం గమనార్హం.   

Advertisement
Advertisement