ఎడతెగని మథనం!

3 Dec, 2023 05:08 IST|Sakshi
‘హ్యాట్రిక్‌ లోడింగ్‌ 3.0... వేడుకలకు సిద్ధంగా ఉండండి’ అంటూ మంత్రి కేటీఆర్‌ శనివారం రాత్రి ఇలా తాను తుపాకీ గురిపెట్టిన ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్, ఇతర కీలక నేతల భేటీ 

ఏయే సెగ్మెంట్లలో గెలుస్తాం, ఎక్కడ గట్టి పోటీ జరిగిందనే పరిశీలన 

సొంతంగానే మేజిక్‌ ఫిగర్‌ సాధిస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత ధీమా 

హంగ్‌ వస్తే ఎంఐఎం మద్దతుతో సర్కారు ఏర్పాటుపై చర్చ? 

బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశమున్న చోట అప్రమత్తం 

ఫలితాలు రాగానే గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు రావాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు కొద్దిగంటల్లో వెలువడనుండగా బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భవిష్యత్‌ కార్యాచర ణపై దృష్టి సారించారు. ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, ఇతర నేతలతో రెండో రోజూ ఎడతెగని మంతనాలు జరిపారు.

పార్టీ వార్‌రూమ్‌ నివేదికలతోపాటు ఎగ్జిట్‌పోల్స్, వివిధ సంస్థలు, నిఘా వర్గాలు, పార్టీ అభ్యర్థులు, ఇన్‌చార్జులు అందించిన నివేదికలను లోతుగా విశ్లేషించారు. ఆదివారం వెలువడే ఫలితాలు బీఆర్‌ఎస్‌కు సానుకూలంగా ఉంటాయని గట్టిగా విశ్వసిస్తున్న కేసీఆర్‌.. మళ్లీ మన ప్రభుత్వమే ఏర్పడుతుందంటూ పార్టీ నేతలకు భరోసా కల్పిస్తున్నారు. సొంతంగానే మేజిక్‌ ఫిగర్‌ను అందుకుంటామని చెప్తున్నారు. 

అవసరమైతే ఎంఐఎంతో కలసి.. 
కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేజిక్‌ ఫిగర్‌ అయిన 60 సీట్లు దక్కించుకునే అవకాశం లేదని బీఆర్‌ఎస్‌ శిబి రం లెక్కలు వేస్తోంది. ఒకవేళ హంగ్‌ ఫలితాలు వస్తే, అవసరమైతే మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్‌ సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్‌ శిబిరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా కేసీఆర్‌ నిశితంగా గమనిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పాయి.

ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకోవాలని ఆదేశించారని తెలిపాయి. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియను పార్టీపరంగా సమన్వయం చేసే బాధ్యతను కేటీఆర్‌ ఆధ్వర్యంలోని వార్‌రూమ్‌కు.. పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకునేలా చూడాల్సిన బాధ్యతను కేటీఆర్, హరీశ్‌రావులకు అప్పగించారు. 

గెలిచే చాన్స్‌ ఉన్నవారి జాబితా సిద్ధం చేసి.. 
వివిధ వర్గాల నుంచి అందిన నివేదికల ఆధారంగా గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాలు, అభ్యర్థులతో బీఆర్‌ఎస్‌ ఓ ప్రాథమిక జాబితాను సిద్ధం చేసుకుంది. మరోవైపు స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశమున్న (ఉత్కంఠ పోటీతో) నియోజకవర్గాల పరిస్థితిని మదింపు చేసి మరో జాబితాను రూపొందించుకున్నట్టు సమాచారం. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశమున్న స్థానాలపైనా బీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో వారి మద్దతు అవసరమయ్యే పక్షంలో సంప్రదింపులకు సిద్దంగా ఉండాలని పార్టీ కీలక నేతలను ఆదేశించినట్టు తెలిసింది.

ఉమ్మడి నల్గొండ మినహా ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలో గణనీయంగా సీట్లు సాధిస్తామని... ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పైచేయి బీఆర్‌ఎస్‌దే ఉంటుందని కేసీఆర్‌ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో బీజేపీ బలంగా ఓట్లు చీల్చుతుందని.. దీనితో ఆయా జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ మిశ్రమ ఫలితాన్ని సాధిస్తుందనే అంచనా వేసుకుంటున్నట్టు వివరిస్తున్నాయి.  

కౌంటింగ్‌ జాగ్రత్తలపై కేటీఆర్‌ సూచనలు 
ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏజెంట్ల నియామకం, కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్లతోనే గెలుపోటములు మారే అవకాశం ఉందని.. చివరి నిమిషం వరకు ఏజెంట్లు లెక్కింపు కేంద్రంలోనే ఉండాలని, అభ్యర్థులు కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు.   

మరిన్ని వార్తలు