కేసీఆర్‌ వ్యూహం: ఒవైసీ అనూహ్య నిర్ణయం

11 Feb, 2021 13:18 IST|Sakshi

టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన ఎంఐఎం

సాక్షి, హైదరాబాద్‌ : ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠంపై అధికార టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేసింది. ముందునుంచి ఊహించినట్లే గులాబీ బాస్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యూహత్మకంగా వ్యవహరించి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలను దక్కించుకున్నారు. మెరుపు వేగంతో దూసుకువచ్చిన బీజేపీ దూకుడును సునాయాసంగా ఎదుర్కొన్నారు. మిత్రపక్షం  ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఎన్నిక సందర్భంగా ఎంఐఎం పార్టీ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. మేయర్‌ బరిలో తాము కూడా ఉంటామని తొలినుంచి ప్రచారం చేసిన అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించింది. కీలకమైన సమయంలో అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. మేయర్‌ అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయానికి సపొర్టు తెలిపింది.

మేయర్‌ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి మేయర్ అభ్యర్ధి రాధా ధీరజ్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఎన్నిక ప్రక్రియను చేపట్టిన హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి.. నియమనిబంధనల ప్రకారం మేయర్‌ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎక్స్‌ అఫిషియో సభ్యులు కౌన్సిల్‌ హాల్‌లో కూర్చున్నారు. అనంతరం పోటీలో నిలిచిన ఇద్దరు సభ్యులకు ఎక్కువ మంది సభ్యులు ఎవరికి మద్దతు తెలిపితే (చేతులెత్తి) వారిని విజేతలు ప్రకటిస్తామన్నారు. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఎక్కువ మంది మద్దతు (56+32) తెలపడంతో విజయం సాధించారు.

వ్యూహత్మకంగా వ్యహరించిన కేసీఆర్‌..
అయితే 44 మంది కార్పొరేటర్ల మద్దతుతో పాటు పదిమంది ఎక్స్‌అఫిషియో సభ్యులున్న ఎంఐఎం మేయర్‌ ఎన్నికకు దూరంగా ఉండటం రాజకీయ వర్గల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌-ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న ఒప్పందం కారణంగానే ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌కు, డిప్యూటీ మేయర్‌ ఎంఐఎంకు దక్కెలా సీఎం కేసీఆర్‌, ఒవైసీ ఒప్పందం కుదుర్చుకున్నారని తొలినుంచి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్‌ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌.. రెండు కీలక పదవులను దక్కించుకోవడంలో వ్యూహత్మకంగా వ్యవహరించారు. దీంతో రాజధాని నగరంపై మరోసారి పట్టునిలుకున్నారు.

మేయర్ ఎన్నిక‌: గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా

>
మరిన్ని వార్తలు