బాబూ.. మేనిఫెస్టో అమలుపై చర్చకు రా.. మంత్రి కారుమూరి సవాల్‌

30 May, 2023 15:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు అలవి కాని హామీలతో ప్రజలను మళ్లీ బురిడీ కొట్టించే యత్నాలు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,  మేనిఫెస్టో టిష్యూ పేపర్‌ కన్నా హీనమని, అది ఎందుకూ పనికిరాదు. ఒక్కటీ అమలు కాదంటూ మండిపడ్డారు. ‘బాబూ.. నీకు చిత్తశుద్ధి ఉంటే.. మేనిఫెస్టో అమలుపై చర్చకు రా.. ఎవరు ఎన్ని అమలు చేశారో చూద్దాం’ అంటూ మంత్రి కారుమూరి సవాల్‌ విసిరారు.

మంత్రి ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..

టిష్యూ పేపర్‌కన్నా హీనం:
చంద్రబాబూ.. నీ మొఖంలో రాజకీయంగా చావుకళ వచ్చింది. నీలో ప్రేతకళ కనిపిస్తోంది. అయినా సరే పదవీకాంక్ష. ఇంకా దోచుకోవాలన్న తపన వదలట్లేదు. ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించావు. ఆడబిడ్డలకు 18 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.18 వేల చొప్పున 5 ఏళ్లలో రూ.90 వేలు ఇస్తామంటున్నారు. ప్రజలు నిన్ను నమ్ముతారా? ఇంకా తల్లికి వందనం. దీపం పథకం. అన్నీ అబద్ధాలు. మహిళలకు ఉచిత ప్రయాణం. ఇది గతంలో కూడా చెప్పావు. అమలు చేయలేదు. పిల్లలకు ఉచిత ప్రయాణం అని, దాన్ని కూడా అమలు చేయలేదు.

పారదర్శకంగా మా పథకాలు:
సీఎం వైఎస్‌ జగన్, పదవీ బాధ్యతలు స్వీకరించి, నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రమంతా వేడుక చేసుకుంటున్నారు. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రధాన అర్హతగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేదు. వైఎస్‌ జగన్‌ పాలనలో నిరుపేదలతో పాటు, అన్ని వర్గాల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు.

నిజానికి గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు.. కలెక్టర్లకు ఒక మాట చెప్పారు. తన పార్టీ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అదే సీఎం జగన్, కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందాలని నిర్దేశించారు. అందుకే ఎక్కడా అవినీతికి తావు లేకుండా, ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.
చదవండి: చంద్రబాబు భయాన్నే ఈనాడు హైలైట్‌ చేసింది

అంతులేని ప్రజాదరణ:
అందుకే ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. మా జిల్లాలో చంద్రబాబు రైతు పోరు బాట పేరుతో పాదయాత్ర చేస్తే, కనీసం 500 మంది కూడా లేరు. అదే నా నియోజకవర్గంలో నేను నిన్న బైక్‌ ర్యాలీ నిర్వహిస్తే.. దాదాపు 6,500 మోటర్‌సైకిళ్లపై.. దాదాపు 13 వేల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చంద్రబాబు పాదయాత్రలో 450 మంది పాల్గొంటే, సభకు కేవలం 1100 మంది మాత్రమే హాజరయ్యారు. అదే మా సభకు ఏకంగా 13 వేల మంది హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలకు ఆ స్థాయిలో ఆదరణ లభిస్తోంది.

అన్ని వర్గాలకు న్యాయం:
సీఎం జగన్‌.. తన పాలనలో రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపిస్తే, చంద్రబాబు ఒక్కరిని కూడా పంపలేదు. ఇంకా జగన్‌ 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. వారిలో కొందరు అట్టడుగు వర్గంలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇంకా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆ పదవులు కూడా ఇచ్చారు.

అదే చంద్రబాబు బీసీలను ఏమన్నాడు? వారి తోక కట్‌ చేస్తానన్నాడు. తాట తీస్తానన్నాడు. ప్రతి కులాన్ని అవమానించి మాట్లాడడం చంద్రబాబుకు అలవాటు. వారిని కేవలం ఓటింగ్‌ యంత్రాలుగా చూడడమే తప్ప, ఒక్క బీసీకి కూడా ఆయన న్యాయం చేయలేదు. అదే జగన్‌ పాలనలో ఇంటింటికీ వెళ్తున్న వలంటీర్లు.. ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటి గడప వద్దే అందిస్తున్నారు. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడంతో పాటు, దాదాపు 22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నాం.

బాబు సిద్ధాంతం. దోచుకో–దాచుకో:
2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసిన చంద్రబాబు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. రైతుల రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి, ఆ మాట కూడా తప్పాడు. చివర్లో ఎన్నికల ముందు పౌర సరఫరాల సంస్థ పేరుతో రుణం తీసుకుని పసుపు కుంకుమ కింద పంపిణీ చేశాడు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం అందించిన సీఎం జగన్, ప్రతి ఇంట్లో.. ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్నారు. అదే చంద్రబాబు తన పాలసలో చేసిందని చెప్పుకోవడానికి ఏ ఒక్కటి కూడా లేదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో రూ.371 కోట్ల అవినీతి. విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేయించావు. దుర్మార్గంగా దోపిడి. దోచుకో. దాచుకో.. అదే బాబు సిద్ధాంతం.

రాష్ట్ర రుణం తక్కువే:
సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని దుయ్యబట్టిన నీవు కూడా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నావు. మేము రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నామని విమర్శిస్తున్నావు. నిజానికి ఆ స్థాయిలో మేము అప్పులు చేయడం లేదు. నీ హయాంలో రూ.2,71,450 లక్షల కోట్లు అప్పు చేశావు. అదే మా ప్రభుత్వం కేవలం రూ.1.30 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది. అలాగే తీసుకున్న రుణంలో ప్రతి రూపాయికి లెక్క ఉంది. అదే యూపీ అప్పు చూస్తే.. ఏకంగా రూ.8 లక్షల కోట్లు. తమిళనాడు అప్పు రూ.5.50 లక్షల కోట్లు, కర్నాటక అప్పు రూ.5 లక్షల కోట్లు. గుజరాత్‌ అప్పు రూ.7 లక్షల కోట్లు. వాటితో పోల్చుకుంటే మన అప్పులు చాలా తక్కువ. అయినా అదే పనిగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నావు.

మాది జనరంజక పాలన:
చంద్రబాబూ నీవు నిజం చెబితే.. నీ తల వెయ్యి ముక్కలవుతుంది.. నీ జీవితమంతా అబద్ధాలమయం. అదే సీఎం జగన్‌.. చేసేదే చెబుతాడు. చెప్పిందే చేస్తాడు. ఆయనది జనరంజక పాలన. విద్యా రంగంలో 14వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నాం. రాష్ట్ర జీడీపీలో మనమే ముందున్నాం. కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకొస్తే.. దానిపైనా ఏడుపే. రాష్ట్ర ప్రజలు బాగుపడొద్దు. వారు ఇబ్బందుల్లో ఉండాలి. అప్పుడే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలి. తద్వారా మళ్లీ అధికారంలోకి రావాలన్నదే నీ ఆలోచన. అందుకే రాష్ట్రానికి మేలు జరుగుతుంటే కూడా ఓర్చుకోలేకపోతున్నావు. రాష్ట్రం చాలా రంగాల్లో ముందుంది. దీన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించింది.

బాబుకు ఓటమి తప్పదు:
దీంతో చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఈర్శ్యతో తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వంపై అదేపనిగా బురద చల్లుతున్నారు. అయితే మీరు ఎన్ని చేసినా, మీకు మళ్లీ ఓటమి తప్పదు. నాడు ఎన్టీఆర్‌ను అన్ని రకాలుగా వేధించి, ఆయన నుంచి పదవిని, పార్టీని లాక్కున్నారు. ఆయనను అంతులేని క్షోభకు గురి చేశారు. అంత దుర్మార్గుడు చంద్రబాబు అని.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

మరిన్ని వార్తలు