ఎస్‌ఈసీ నోటీసు: వివరణ ఇచ్చిన కొడాలి నాని

12 Feb, 2021 16:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఎస్‌ఈసీ షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. ఆయన తరఫున తన న్యాయవాది తానికొండ చిరంజీవి శుక్రవారం ఎస్‌ఈసీ కార్యాలయంలో కమీషన్ కార్యదర్శి కన్నబాబుని‌ కలిసి షోకాజ్‌ నోటీసుపై మంత్రి‌ కొడాలి నాని వివరణను అందించారు. అనంతరం న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘ప్రెస్‌మీట్‌లో ఎన్నికల‌ కమీషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి‌ కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 లోపు సమాధానం ఇవ్వాలని తెలిపింది. ఎస్‌ఈసీ షోకాజ్ నోటీస్‌కి సమాధానం ఇచ్చాం’’ అన్నారు. 

‘‘కొడాలి నాని ఎస్ఈసీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మంత్రికి చెడు కలిగించాలని ఈ నోటీసు ఇచ్చారు. నిమ్మగడ్డ, చంద్రబాబుల మధ్య ఉన్న బంధంపై ప్రజలు అనుకున్నదే మాట్లాడారు. ఒక పార్టీకి ఎస్ఈసీ కొమ్ము కాయడం వ్యక్తిగతమే. షోకాజ్ నోటీస్ వెనక్కి తీసుకోవాలని రిప్లై ఇచ్చాం. మంత్రి మొదటి విడత ఎన్నికల ఫలితాల గురించి మాత్రమే ప్రేస్‌మీట్‌లో మాట్లాడారు. ఒకవేళ ఎస్‌ఈసీ వాటిని అసంబద్ధమైన, దురదృష్టకరమైన వ్యాఖ్యలుగా భావిస్తే మేం లీగల్‌గా ఎదుర్కొంటాం. అందుకు తగిన సమయం ఇవ్వాలని కోరాం’’ అని తెలిపారు.

ఎస్‌ఈసీ అంటే నాకు గౌరవం ఉంది: కొడాలి నాని
రాజ్యాంగ సంస్థలు, ఎన్నికల కమిషన్‌పై నాకు గౌరవం ఉంది అన్నారు మంత్రి కొడాలి నాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీస్‌పై వివరణ ఇచ్చాను. ఎన్నికల కమిషన్‌ మా పట్ల ఒక రకంగా, టీడీపీ పట్ల మరో రకంగా వ్యవహరిస్తున్నారన్న భావన ఉంది. తప్పు చేయని మాకు నోటీసులిచ్చి, ఎస్‌ఈసీని విమర్శించిన బాబుకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. జరిగిన పరిణామాలపై ప్రశ్నిస్తే నోరు నొక్కాలని చూస్తున్నారు. ప్రజల్లో ఎస్‌ఈసీపై ఉన్న భావనను తొలగించుకోమని సూచించాను. ఎస్‌ఈసీ అంటే నాకు గౌరవం ఉంది. నా ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోకుండా నోటీసులు ఇచ్చారు. నా భావాన్ని అర్థం చేసుకొని నోటీసులు వెనక్కి తీసుకోవాలి. తొలిదశ తరహాలోనే అన్నివిడతల్లో ఫలితాలు రాబోతున్నాయి. ప్రజా తీర్పుని అడ్డుకోవటం ఎవరితరమూ కాదు. ఏపీలో టీడీపీ భూస్థాపితం కాబోతోంది’’ అన్నారు కొడాలి నాని.

చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్‌’ నిగ్గుతేల్చండి 
 

మరిన్ని వార్తలు