ఇక కల్తీనీ ఇట్టే పసిగట్టొచ్చు

15 Nov, 2023 05:19 IST|Sakshi

పాల నుంచి ఫార్మా ఉత్పత్తుల వరకు.. 

విషపూరిత రసాయనాలు, నాసిరకం గుర్తింపునకు మార్గం సుగమం 

అందుబాటులోకి పులివెందుల స్టేట్‌–సెంట్రల్‌ లేబొరేటరీ 

దేశంలోనే తొలి అతిపెద్ద అత్యాధునిక కేంద్రం 

100కు పైగా పరీక్షలు..

సాక్షి, అమరావతి: పాలు, పాల ఉత్పతుల్లో విషపూరిత రసాయనాలు, ఆహార పదార్థాలు, మంచినీరు,  మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీని ఇక ఇట్టే పసిగట్టవచ్చు. ఇందుకోసం రూ.11 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన దేశంలోనే తొలి అతిపెద్ద స్టేట్‌ సెంట్రల్‌ లేబోరేటరీ అందుబాటులోకి వచ్చింది.

పులివెందులలోని ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీ కార్ల) ప్రాంగణంలో ఈ అత్యాధునిక లేబరేటరీని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. దీంతో పాలల్లో నాణ్యతను అంచనా వేసేందుకు రాజమండ్రి, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాల డెయిరీల్లో హై ఎండ్‌ ఎక్యూప్‌మెంట్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసినట్లయింది. 

100కు పైగా పరీక్షలు చేసే వెసులుబాటు 
రాష్ట్ర పరిధిలోని శాంపిల్స్‌ను పరీక్షించేందుకు ఇప్పటి వరకు కోల్‌కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి సుదూర ప్రాంతాలకు పంపేవారు. దూరాభారం కావడంతో ఒక్కో శాంపిల్‌కు రూ.2,500 నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యేది. కాగా రూ.3కోట్లతో నిర్మించిన పులివెందుల లే»ొరేటరీలో రూ.8 కోట్లతో ఇందుకు సంబంధించి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు.

వందకుపైగా పరీక్షలు నిర్వహించేలా ఈ ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. సుమారు 15 మంది నిష్ణాతులైన సిబ్బందిని నియమించారు. వీరిలో 8 మంది శాస్త్రవేత్తలతో పాటు జూనియర్, సీనియర్‌ ఎనలిస్ట్‌లు ఉంటారు. కాగా, ఆర్నెల్ల తర్వాత నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లేబొరేటరీస్‌ (ఎన్‌ఎబీఎల్‌) నుంచి ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తారు. 

నిర్దేశిత గడువులోగా ఫలితాలు.. 
పాలు, పాల ఉత్పత్తులతో పాటు తేనె, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, ప్యాక్డ్‌ ఫుడ్, స్వీట్స్, జెల్లీ, కాన్పెక్టనరీస్, మాంసం, రొయ్యలు, గుడ్లు, గ్రాస్‌ సీడ్స్‌లలో కొవ్వు, ప్రొటీన్, ఎస్‌ఎన్‌ఎఫ్, నాన్‌ ప్రొటీన్‌ నైట్రోజెన్, పెస్టిసైడ్స్, యాంటిబయోటిక్స్, హెవీ మెటల్స్, కల్తీలు (అడాల్టరెంట్స్‌) ఇతర కలుషితాల (కంటామినెంట్‌ ఎలిమెంట్స్‌)ను 36–48 గంటల్లోపే పరీక్షిస్తారు. కాగా వీటిల్లో బ్యాక్టీరియల్‌ అవశేషాలను 4–5 గంటల్లో గుర్తిస్తారు. అదే మాంసం, రొయ్యలు, గుడ్లతో పాటు గ్రాస్‌ సీడ్స్, ఎరువులు, వేస్ట్‌ వాటర్‌లో ప్రొటీన్, నాన్‌ ప్రొటీన్‌ నైట్రోజెన్‌ అవశేషాలను 4–6 గంటల్లోనూ పసి గట్టవచ్చు.

తాగునీరులో పోషక లోపాలు, కలుషితాలను 1–2 గంటల్లోనూ, ఫార్మా మందుల్లో 24గంటల్లో, ఇన్ప్యూరిటీ ఎనాలసిస్‌ (మలినాలు)ను 25 గంటల్లోనూ, ఖనిజాలు, పోషక లోపాలను 36 గంటల్లోనూ, ప్రీ క్లీనికల్, క్లినికల్‌ ఎనాలసిస్‌ను 15 రోజుల్లోనూ పరీక్షిస్తారు. తనిఖీల్లో గుర్తించిన శాంపిల్స్‌ను ఆయా డిపార్టుమెంట్లు ఈ లే»ొరేటరీకి పంపితే నిర్ధేశిత గడువులోగా విశ్లేషిoచి ఫలితాలతో కూడిన నివేదికలను అందజేస్తారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు సైతం ఈ లేబోరేటరీ సేవలను ఉపయోగించుకోవచ్చు. 

అవశేషాలను గుర్తించడం ఇక సులభం 
అత్యాధునిక స్టేట్‌ సెంట్రల్‌ ల్యాబ్‌ సేవలు అందుబాటులోకి వచ్చా­యి. పాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, ఎరువులు,తాగునీరు, మందులు, మాంసం, గుడ్లు, రొయ్యల్లో  పురుగు మందుల అవశేషాలు, యాంటీబయాటిక్, పశువైద్య అవశేషాలు, భారీలోహాలు, మైక్రో టాక్సిన్‌లు, వ్యాధి కారకాలను నిర్ధేశిత గడువులోగా గుర్తించొచ్చు. భౌతిక, రసాయన, జీవ నాణ్యతను విశ్లేషిoచి ద్రువీకరణ పత్రాలు పొందొచ్చు. కల్తీలకు ఇక పూర్తిగా చెక్‌ పెట్టొచ్చు.  – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ 

మరిన్ని వార్తలు