దుర్గమ్మపై ఆన.. లంచం తీసుకోలేదు

8 Sep, 2023 03:11 IST|Sakshi
తడి బట్టలతో ఆలయానికి వస్తున్న దేవేందర్‌రెడ్డి

నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా

ఏడుపాయల ఆలయంలో మెదక్‌ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి ప్రమాణం

ఆయనది అసత్య ప్రమాణం

ఆలయంలో అసమ్మతి నేతల ప్రమాణం

పాపన్నపేట (మెదక్‌): ఏడుపాయల వనదుర్గ ఆలయం గురువారం బీఆర్‌ఎస్‌ నాయకుల సవాళ్లు.. ప్రతి సవాళ్లు, ప్రమాణాలకు వేదికైంది. బీఆర్‌ ఎస్‌లోని రెండు వర్గాలు తడి బట్టలతో ఒకరు.. పసుపు బట్టలతో మరొకరు అమ్మవారి ఎదుట ప్రమాణాలు చేశారు. ‘నా రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదని వన దుర్గమ్మ మాత ఎదుట ప్రమాణం చేస్తున్నా.

తప్పు చేసినట్లు నిరూపిస్తే మెదక్‌ రాందాస్‌ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా’ అంటూ ఇఫ్కో డైరెక్టర్, మెదక్‌ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి ఏడు పాయల వనదుర్గ అమ్మవారి ఎదుట గురువారం ప్రమాణం చేశారు. తాను ప్రకటించినట్లుగా 150 మంది కార్యకర్తలతో ఆలయానికి చేరుకున్నారు. మంజీరా నదిలో స్నానం చేసి రాజగోపురంలోని దుర్గమ్మ ఉత్సవ విగ్రహం వద్ద పూజలు చేసి ప్రమా ణం చేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడు తూ కోనాపూర్‌ సొసైటీలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, భూకబ్జాలు, ఇసుక దందాలు, భూపంచాయితీలు, సెటిల్మెంట్లు చేయలేదన్నారు. సామాజికసేవ కోసం కాంట్రాక్టర్లు, అధికారుల సహాయం తీసుకున్నానే తప్ప ఎవరినీ బెదిరించలేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పారు.

వందల ఎకరాల భూములు కొన్నారు...
దైవ సన్నిధిలో చేసిన అసత్య ప్రమాణాలతో దేవేందర్‌రెడ్డి పతనం ప్రారంభమైందని బీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు అన్నారు. దేవేందర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన అసమ్మతి నాయకులు మడూర్‌ ఏఎంసీ మాజీ చైర్మన్‌ గంగా నరేందర్, చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ, సర్పంచ్‌ రాజారెడ్డి, అడ్వొ కేట్‌ జీవన్‌రావు తదితరులు 100 మందితో కలిసి గురువారం ఏడుపాయలకు చేరుకున్నారు.

పసుపు బట్టలతో ఆలయంలోకి వచ్చి పూజలు చేసి అమ్మ వారి సన్నిధిలో ప్రమాణం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవేందర్‌రెడ్డి తన భూదందాలు, ఇసుక మాఫియా, లంచాలు, కోనాపూర్‌ సొసైటీ వ్యవహారం, అక్రమ సంపాదనపై జవాబు చెప్పకుండా అమ్మవారి ఎదుట అసత్య ప్రమాణం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌తో తాము వచ్చామని పేర్కొన్నారు. రూ.కోట్ల అవినీతిపై కాకుండా కేవలం ఏడుపాయల విషయంపై స్పందించడాన్ని ప్రజలు గమనించాలన్నారు.

శంకరంపేట, నర్సాపూర్, మెదక్‌తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఏ హోదాలో కలెక్టర్‌ పక్కన కూర్చొని సమావేశాల్లో సమీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెదక్‌ డెయిరీ పేరిట కార్యకర్తల నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేసిన రూ. కోటి సొమ్మును ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మెదక్‌ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే రెబల్‌ అభ్యర్థిని పోటీకి దింపక తప్పదని హెచ్చరించారు. 
 

మరిన్ని వార్తలు