వీరంతా బీజేపీ అభ్యర్థులేనా?

12 Nov, 2023 02:59 IST|Sakshi

111 మంది అభ్యర్థుల్లో 30 మంది మాత్రమే పాతనేతలు

 పార్టీ జాబితాపై రగులుతున్న పాతకాపులు, ఏబీవీపీ, యువమోర్చా విభాగాలు

దీపావళి తర్వాత తదుపరి కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అభ్యర్థుల జాబితాపై పార్టీలోని పాతకాపులతోపాటు ఏబీవీపీ, యువమోర్చా విభాగాల్లోని వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ ప్రకటించిన 111 మంది అభ్యర్థుల్లో 30–35 మంది మాత్రమే పాతనేతలు, పార్టీ సిద్ధాంత భూమిక ఉన్నవారని.. ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక భూమిక ఉన్న పార్టీగా ప్రజలకు ఏరకమైన సందేశాన్నిస్తారని నిలదీస్తున్నారు. అసలు ఈ అభ్యర్థులను బీజేపీ వారిగా భావించవచ్చా? ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాక వీరిలో ఎంత మంది పార్టీలో మిగులుతారనే ప్రశ్నలను సంధిస్తున్నారు.

పార్టీలో ప్రస్తుత ముఖ్యనేతలు, మరీ ముఖ్యంగా బయట నుంచి వచ్చిన నేతలు వర్గాల వారీగా విడిపోయి తమ అనుయాయులకు పెద్దసంఖ్యలో టికెట్లు ఇప్పించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టికెట్ల ఖరారులో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలతో బీజేపీ విమర్శల పాలైదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రపార్టీలోని ముఖ్యనేతలు తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు చేసిన హెచ్చరికలకు జాతీయ, రాష్ట్రనాయకత్వాలు లొంగిపోవడం ఎలాంటి సంకేతాలిస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఉన్న ముఖ్యనేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కొందరు వర్గాలుగా విడిపోయి టికెట్ల కేటాయింపులో తమ పట్టును నిలుపుకునేలా ఒత్తిళ్లు తెచ్చి పైచేయి సాధించడం వంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. 

ఏళ్లకు ఏళ్లు పనిచేసినా...
నల్లగొండ, చేవెళ్ల, మహబూబాబాద్‌ ఎంపీ సీట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా పాతకాపులు, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఏళ్లకు ఏళ్లుగా పనిచేస్తున్న వారికి అవకాశం లభించలేదని వారు వాపోతున్నారు. ఈ స్థానాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. రెండు, మూడువారాల వ్యవధిలోనే పార్టీలో చేరిన పది, పదిహేను మందికి సీట్లు ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ స్థానాల్లో వీరంతా కచ్చితంగా గెలుస్తారని నాయకత్వం చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు.

అలాంటపుడు అన్నిచోట్లా కాకపోయినా వీలున్న చోట్ల అయినా పార్టీని నమ్ముకున్న వారికి పార్టీకి బలపడేందుకు అవకాశం ఉండేదని వాదిస్తున్నారు. మొత్తంగా 111 స్థానాల వారీగా పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల పూర్వాపరాలు, గతంలో ఉన్న పార్టీలు వంటి వాటిని పరిశీలిస్తే... వీరిలో చాలామంది రెండు, మూడుపార్టీలు మారిన వారేనని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే యోచనలో దీర్ఘకాలం పార్టీలో పనిచేసిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు