అచ్చెన్న ‘రాజ్యం’లో అరాచకం

28 Feb, 2021 04:21 IST|Sakshi

పంచాయతీకి పోటీ చేస్తే బహిష్కరించారు

రజకులు, నాయీబ్రాహ్మణులను రానివ్వడం లేదు

వైఎస్సార్‌ సీపీ మద్దతుదారు, నిమ్మాడ సర్పంచ్‌ అభ్యర్థి కింజరాపు అప్పన్న  

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియంత వైఖరి మరోసారి బట్టబయలవుతోందని నిమ్మాడ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు, సర్పంచ్‌ అభ్యర్థి కింజరాపు అప్పన్న అన్నారు. సర్పంచ్‌ పదవికి పోటీ చేశాననే కారణంతో తనను గ్రామ బహిష్కరణ చేశారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్, సురేష్‌ వారి అనుచరులు ప్రతి రోజూ తనను భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులతో గ్రామస్తులను మాట్లాడనివ్వడం లేదన్నారు.

పొలానికి కూలీలు కూడా రాకపోవడంతో మినప చేను వదిలేయాల్సి వచ్చిందని వాపోయారు. దుస్తులు ఉతికేందుకు రజకులు, క్షవరం చేయడానికి నాయీబ్రాహ్మణులను రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. తమతో ఎవరైనా మాట్లాడితే వారిని బెదిరిస్తున్నారని అన్నారు. అచ్చెన్నకు ఎదురు తిరిగి మరణించిన వారిలో ఆరో వ్యక్తిగా శవమైపోతావ్‌ అని బెదిరిస్తున్నారని వాపోయారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని, గ్రామ బహిష్కరణ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లే కాపాడాలని కోరారు. చిన్నబమ్మిడికి చెందిన వాన ఆదినారాయణ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు