No Road No Vote: రోడ్డు వేయకపోతే ఓట్లు వేయమంతే! వీవీఐపీ సీట్‌లో ఓ విలేజ్‌ నిరసన

20 Mar, 2024 16:19 IST|Sakshi

సాధారణంగా ప్రజలు ఓట్లు వేసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుని వారి ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకుంటారు. కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు పట్టించుకోకపోతే విసిగిపోయిన ప్రజలు ఎన్నికలే అదనుగా నిరసనకు దిగుతున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని భీష్మిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎక్కడో చోట ఇలాంటి నిరసనల గురించి వింటుంటాం. అలాంటిదే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ అమేథీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. 

ఇంకొన్ని రోజుల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలోని జామో బ్లాక్‌ పరిధిలోని పురే అల్పి తివారీ అనే కుగ్రామం ప్రజలు తమ గ్రామానికి రోడ్డు వేయాలని నిరసనకు దిగారు. గ్రామం వెలుపల స్థానికులు నినాదాలు చేస్తూ వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ రోడ్డు వేయకపోతే ఓట్లు వేయబోమని బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. 

వీవీఐపీ నియోజకవర్గంగా పరిగణించే అమేథీ.. 2019లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గెలిచే వరకు నెహ్రూ-గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహించింది. గ్రామస్తుల నిరసన గురించి సమాచారం అందిందని తదుపరి విచారణ తర్వాత సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని గౌరీగంజ్ ఎస్‌డీఎం దిగ్విజయ్ సింగ్ వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.

ఆ కుగ్రామానికి చెందిన ఓంప్రకాష్ ఓఝా అనే వ్యక్తి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’(ట్విటర్‌) ద్వారా తమ గ్రామ దుస్థతిని తెలియజేశారు. గ్రామాన్ని సమీప ప్రాంతాలకు కలుపుతున్న ఏడు చిన్న అస్తవ్యస్తమైన రోడ్లు ఉన్నప్పటికీ సరైన రోడ్లు లేకపోవడాన్ని ఎత్తిచూపారు. గ్రామానికి సరైన రోడ్డు లేకపోవటంతో గ్రామానికి చెందిన యువతీయువకుల వివాహాలు వేరే చోట చేయాల్సి వస్తోందని, వర్షం పడితే బైక్‌లు కదిలే పరిస్థితి ఉండదని వాపోయాడు.

Election 2024

మరిన్ని వార్తలు