సీఎం మీద గెలిస్తే జెయింట్‌ కిల్లరే! 

9 Nov, 2023 02:03 IST|Sakshi

సీఎం కేసీఆర్‌.. ఈ సార్‌తో ఎన్నికల్లో పోటీ అంటే.. అస్స లు మామూలు విషయం కాదు.. ఎప్పుడో నలభై ఏళ్ల కిందట ఒకే ఒక్కసారి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఈయన ఆ తర్వాత.. ఇన్ని దశాబ్దాలుగా ఎంపీగా పోటీ చేసినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుపు గుర్రంపై స్వారీ చేస్తూనే ఉన్నారు. రికార్డు మెజారిటీలు సాధిస్తూనే ఉన్నారు. అలాంటి కేసీఆర్‌పై తొలిసారి ఈ దఫా సీరియస్‌గా పోటీకి దిగుతున్నాయి ప్రతిపక్షాలు. ఓ రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఆ క్రమంలోనే  గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థిగా  ఈటల రాజేందర్‌ పోటీ చేస్తుంటే... కామారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరికిద్దరూ కేసీఆర్‌ను ఓడిస్తామనే చెబుతున్నారు. ఒకవేళ ఓడిపోయినా.. పోయేదేం లేదు... సీఎం మీద పోటీ చేశాడు అనే పేరొస్తది. కానీ ఏమో గుర్రం ఎగరావచ్చు తరహాలో గెలిస్తే... జెయింట్‌ కిల్లర్‌ అనే ట్యాగ్‌లైన్‌ ఎప్పటికీ ఉంటుంది.

 ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల్లో ఇదే అంశం చర్చనీయాంశమైంది. గజ్వేల్, కామారెడ్డిల్లో సీఎంపై గెలిచి.. ఒకవేళ ఆ గెలిచిన వాళ్ల పార్టీనే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా కూడా ముందు వరుసలో ఉండొచ్చనే దూరాలోచన కూడా పోటీకి కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఓ సారి చరిత్ర చూస్తే 
తెలంగాణలో ముఖ్యమంత్రిపై పోటీ చేసి గెలిచి జెయింట్‌ కిల్లర్‌గా పేరు పొందిన చరిత్ర మహబూబ్‌నగర్‌కు చెందిన చిత్తరంజన్‌ దాస్‌కు ఉంది. 1989 సాధారణ ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గుడివాడ, హిందూపురంతో పాటు తెలంగాణలోని కల్వకుర్తి  నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి చిత్తరంజన్‌ దాస్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాగా ఎన్టీ రామారావుపై గెలిచిన చిత్త రంజన్‌దాస్‌ ముఖ్యమంత్రి కాకపోయినా... కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డిల పరిస్థితి ఏంటో డిసెంబర్‌ 3న తేలుతుంది.  

మరిన్ని వార్తలు