నోట్‌ దిస్‌ పాయింట్‌.. రూ.50 వేల వరకు తీసుకెళ్లేందుకు అనుమతి 

12 Oct, 2023 07:56 IST|Sakshi

రూ.10 వేలకు మించిన కొత్త వస్తువుల తరలింపూ నిషిద్ధమే.. 

అంతకుమించి తీసుకెళ్తే ఇబ్బందే.. 

సంబంధిత పత్రాలు ఉంటేనే సేఫ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ సోమవారం వెలువడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు విభాగం ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుచేయడం ప్రారంభించింది. ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి వినియోగించే అక్రమ మద్యం, నగదుపై డేగకన్ను వేసింది.

సోమ, మంగళవారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి స్వా«దీనం చేసుకుంది. ఎన్నికల క్రతువు ముగిసేవరకు ఈ తనిఖీలు సాగనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వృత్తి, వ్యాపార, క్రయవిక్రయాల కోసం నగదు తరలించే వారిలో అనేక సందేహాలున్నాయి. కోడ్‌ అమల్లో ఉన్నంత కాలం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు. 

రూ.50 వేలకు మించితే... 
ఓ వ్యక్తి తన వెంట రూ.50 వేల వరకు మాత్రమే నగదును తీసుకెళ్లవచ్చు. అంతకుమించిన మొత్తం తీసుకెళ్లాలంటే దాని మూలాలను నిరూపించే ఆధారాలు కచ్చితంగా కలిగి ఉండాలి. వ్యాపారులు దానికి సంబంధించిన పత్రాలు, లావాదేవీల బిల్లులు కలిగి ఉండాల్సిందే. సాధారణ వ్యక్తులు తీసుకెళ్తుంటే బ్యాంకు నుంచి డ్రా చేసిన పత్రాలు లేదా ఆ నగదు ఎక్కడ నుంచి వచి్చందో, ఎందుకు వినియోగిస్తున్నామో చెప్పడానికి అవసరమైన ఇతర ఆధారాలు చూపించాలి. 

రూ.2 లక్షలకు మించిన నగదు తలింపును మాత్రం పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ మొత్తం తమ వద్దకు ఎలా వచి్చంది? ఏం చేయబోతున్నారు? అనే వాటికి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో పోలీసులు నగదు స్వా ధీనం చేసుకుంటారు. ఇలా సీజ్‌ చేసిన నగదు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే అది జిల్లా ఎన్నికల అధికారి నియమించే కమిటీ వద్దకు వెళ్తుంది.  

నలుగురు సభ్యులతో ఉండే ఈ జిల్లా కమిటీ ఎదుట నగదు యజమాని హాజరై నగదు మూలం, అవసరాలకు సంబంధించి వివరణ ఇవ్వాలి. దీనిపై కమిటీ సంతృప్తి చెందితే నగదు తిరిగి అప్పగిస్తుంది. లేదంటే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఆదేశిస్తుంది.  

 పోలీసులు స్వాదీనం చేసుకున్న నగదు రూ.10 లక్షలకు మించితే విషయం ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. నగదును స్వా«దీనం చేసుకునే ఆ అధికారులు బాధ్యులకు నోటీసులు జారీ చేస్తారు. వారిచ్చే సమాధానాన్ని వివిధ కోణాల్లో పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటారు.  

 కొత్త బంగారం, వెండి నగలు, వస్తువులతోపాటు గిఫ్ట్‌ ఆర్టికల్స్, కుక్కర్లు, క్రికెట్‌ కిట్స్‌ వంటి సామగ్రి విలువ రూ.10 వేలకు మించితే పోలీసులు స్వా«దీనం చేసుకుంటారు. యజమానులు వాటిని వ్యాపార నిమిత్తం తరలిస్తున్నట్లు పత్రాలు చూపించి, నిరూపించుకుంటేనే తిరిగి అప్పగిస్తారు. లేదంటే విషయం ఎన్నికల అధికారుల వద్దకు వెళ్తుంది.  
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సైతం తాము ఖరీదు చేసే ప్రచార, ఇతర సామగ్రికి సంబంధించి విక్రేతలకు రూ.10 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయకూడదు. అంతకంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయాలంటే చెక్కులు, ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే చేయాలి. అభ్యర్థి లేదా అతని ఏజెంట్‌ కూడా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు.  

పోలీసులు స్వా«దీనం చేసుకున్న నగదు (రూ.50 వేలలోపు అయినా), వస్తువులు (రూ.10 వేల కంటే తక్కువ విలువైనవి అయినా) ఓటర్లను ప్రలోభ పెట్టడానికని ఆధారాలు లభిస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. బాధ్యులపై ఐపీసీ 171(బీ) రెడ్‌విత్‌ 171(సీ) సెక్షన్లతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్‌ 123 ప్రకారం వీటిని రిజిస్టర్‌ చేసి దర్యాప్తుచేస్తారు. బాధ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశమూ ఉంది. 

మరిన్ని వార్తలు