నేడే మోదీ బీసీ గర్జన సభ

7 Nov, 2023 02:38 IST|Sakshi

హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సాయంత్రం 5.30కు కార్యక్రమం 

బీజేపీ తరఫున బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారనే అంచనాలు 

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ,ఎస్టీల రిజర్వేషన్ల పెంపుపైనా ప్రకటన చేసే అవకాశం 

కేవలం గంటన్నర సేపట్లోనే ముగియనున్న ప్రధాని పర్యటన

సాక్షి, హైదరాబాద్‌:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి సదరు బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే చర్యలనూ పేర్కొనవచ్చని అంటున్నారు. 

బీసీలను ఆకట్టుకునేందుకు.. 
నిజానికి గతంలో ఎప్పుడు కూడా ఏ వర్గం నుంచి, ఎవరు సీఎం అవుతారని ముందే ప్రకటించే ఆనవాయితీ బీజేపీలో లేదని.. తెలంగాణ జనాభాలో 54శాతందాకా ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాలేదని.. ఈ క్రమంలో బీసీ ఎజెండా, బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.

ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామన్న హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. 

గంటన్నర పాటు పర్యటన 
ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

మరిన్ని వార్తలు