మహానాడు సాక్షిగా టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. ఆయన ప్లాన్‌ ఏంటి?

10 Jun, 2023 17:10 IST|Sakshi

తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడితో పాటు ఆయన తమ్ముడు కృష్ణుడు కూడా బాగా పాపులర్. తునిలో అన్న ఓటమి తర్వాత తమ్ముడు కూడా రెండు సార్లు ఓడిపోయాడు. తమ్ముడితో లాభం లేదని భావించిన యనమల తన కూతురిని తుని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అన్న చేసిన ద్రోహంతో రగిలిపోతున్న కృష్ణుడు ప్రతీకారానికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ యనమల కృష్ణుడి ప్లాన్ ఏంటి?..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని నుండి ఆరు సార్లు గెలిచిన యనమల రామకృష్ణుడు తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత స్థానానికి చేరుకున్నారు. 2009లో ఓటమి తర్వాత యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. యనమల రామకృష్ణుడు అధికార పదవుల్లో ఉన్నంతకాలం.. తుని నియోజకవర్గంలో ఆయన తమ్ముడు కృష్ణుడి హవా కొనసాగింది. అన్న స్థానంలో తుని నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన కృష్ణుడిని రెండు సార్లు అక్కడి ప్రజలు ఓడించి పక్కన కూర్చోబెట్టారు. మూడో సారి పోటీ చేద్దామని అనుకుంటుంటే.. అన్న యనమల తన కుమార్తె దివ్యను తుని ఇన్‌ఛార్జ్‌గా నియమించి.. తమ్ముడికి షాక్ ఇచ్చారు. అన్న నిర్ణయంతో తమ్ముడు కుంగిపోయారు. ఇన్‌ఛార్జ్‌ పదవి పోవడంతో వచ్చే ఎన్నికల్లో సీటు గల్లంతే అని ఆందోళన చెందుతున్నారు. 

అన్న నియోజకవర్గంలో లేకపోయినా.. పార్టీని నిలబెట్టుకుంటూ వస్తుంటే.. ఇప్పుడు ఇన్‌ఛార్జ్‌ పదవి తీసేస్తారా అని కృష్ణుడు రగిలిపోతున్నారు. అన్నపై ప్రతీకారం తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు. పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే తమ్ముడిని బుజ్జగించి దారికి తెచ్చుకున్నారు యనమల రామకృష్ణుడు. అయితే పైకి బాగానే ఉన్నప్పటికీ లోలోన రగలిపోతున్న కృష్ణుడు అవకాశం రాగానే తన కోపాన్ని చూపించారు. ఇటీవల కాకినాడలో జరిగిన టీడీపీ మిని మహనాడుకు డుమ్మా కొట్టారు. మినీ మహానాడుకు హాజరు కాకపోవడంపై కొందరు నేతలు ప్రశ్నించగా.. తన అన్న కుమార్తె దివ్య ఇన్‌ఛార్జ్‌ హోదాలో హాజరైనపుడు.. తనతో పనేముందని వారిని ప్రశ్నించారట కృష్ణుడు. 

చాలా కాలంగా అన్న స్థానంలో పార్టీలో పలుకుబడి పెంచుకున్న యనమల కృష్ణుడు.. ఇక పార్టీతో పని లేకుండా సొంతంగా ఇమేజ్‌ పెంచుకోవాలని నిర్ణయించుకున్నారట. అన్నచాటు తమ్ముడిగా ఉండకుండా.. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటేనే గుర్తింపు ఉంటుందని తన సన్నిహితులు వద్ద చెబుతున్నారట కృష్ణుడు. అందుకే నియోజకవర్గంలో సొంత ఇమేజ్‌తో ఎదగాలనుకుంటున్నానని చెప్పారటా. మొత్తం మీద తునిలో అన్న తీసుకున్న నిర్ణయం తమ్ముడుకి జ్ఞానోదయం కలిగించిందని తుని తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు. ఇదిలా ఉంటే కూతురిని తునిలో పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించిన తర్వాత  అక్కడ టీడీపీ ఆఫీస్ పెట్టేందుకు యనమలకు భవనం దొరకడం లేదని టాక్. భవనం అద్దెకు ఇస్తే రెంట్ ఇస్తారా లేదో అన్న అనుమానంతో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదని సమాచారం. 

యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె దివ్య తునిలో ఉండేది తక్కువ. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లోనే ఎక్కువగా ఉంటారు. అందుకే కృష్ణుడు మద్దుతు లేని రామకృష్ణుడి కోసం పార్టీ ఆఫీస్‌కు భవనం అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదంటున్నారు. మరి అన్నదమ్ముల సవాళ్ళు చివరికి పార్టీని ఏ తీరానికి చేరుస్తాయో అని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. తగ్గేదేలే అంటూ పచ్చ బ్యాచ్‌కు కౌంటర్‌!

మరిన్ని వార్తలు