Karimnagar Politics: సమీకరణాలు మారుతున్నాయా? ఎవరి జాతకాలు ఎలా?

19 Aug, 2022 20:45 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ జిల్లా: ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? పార్టీల్లో కుమ్ములాటలు, వర్గ విభేదాలు ఎలా ఉన్నాయి? టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పరిస్థితేమిటి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? మరో ఇద్దరు మంత్రుల పరిస్థితేమిటి..? ఈటల గజ్వేల్‌కి వెళితే.. హుజూరాబాద్ లో ఎవరు పోటీ చేస్తారు..? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రౌండప్‌లో చూద్దాం..
చదవండి: మునుగోడు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ.. ‍కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్‌ 

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా.. మలి విడత ఉద్యమం ఉవ్వెత్తున లేచి.. ఊరూరా జేఏసీలు ఏర్పడి ప్రజలే సైనికుల్లా మారి రాజకీయ యుద్ధం చేసిన పోరాట గడ్డ.. తొలి సింహగర్జన.. తెలంగాణ రాష్ట్ర సమితి సారథిగా కేసీఆర్ అరెస్ట్ అయ్యింది కరీంనగర్‌లోనే. ఉద్యమాలు చేసిన ప్రాంతం కావడం వల్లే.. రాజకీయంగా కూడా చైతన్యం ఏర్పడింది. ప్రజలు కూడా టీఆర్ఎస్‌కు బాసటగా నిలిచారు.. ఆనాటి నుంచి ఈనాటి వరకూ అండగా ఉంటూ వస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మంట్లో మాత్రం ప్రతిసారీ విభిన్నమైన తీర్పు వస్తోంది. 2009లో కాంగ్రెస్ గెలిస్తే.. 2014లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి బండి సంజయ్ గెలిచారు. ఇక పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో గతంలో కాంగ్రెస్ గెలవగా.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నారు. ఇదే నిజమైతే లోక్‌సభకు ఎవరిని దింపుతారో చూడాలి. పెద్దపల్లి ఎంపీ స్థానంలో మాత్రం టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతనే బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లాలో 2009 వరకూ కాంగ్రెస్ హవా కొనసాగింది. టీఆర్ఎస్ రాకతో హస్తం చతికిలపడింది. గత రెండు ఎన్నికల్లోనూ 13 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్కొక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. ఇదిలా ఉంటే.. హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ రాజకీయ చరిత్రను మార్చేసింది. కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కారు దిగి కాషాయ సేనలో చేరారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలోనే దళితబంధుకు అంకురార్పణ జరిగింది.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖల మంత్రిగా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన సిరిసిల్ల నుంచే పోటీ చేస్తారనేది క్లియర్. కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డే ఈసారి కూడా బరిలో నిలబడతారని భావిస్తున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేత కటకం మృత్యుంజయంతో పాటు రెడ్డబోయిన గోపిల పేర్లు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్ విషయానికి వస్తే కరీంనగర్‌లో ఆయన గ్రాఫ్ ఏమీ తగ్గలేదంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తే తేలికగా గెలుస్తారనే టాక్ వినిపిస్తోంది. ధర్మపురికి ప్రాతినిథ్యం వహించే మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉందంటున్నారు. 

జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వరుస విజయాలతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల ముఖ్య నేతలు కారెక్కారు. వీరిలో కొందరు నేతలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో అలజడి రేగింది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి వర్గ విభేదాలు తలనొప్పిగా మారే పరిస్థితులున్నాయి. టీఆర్ఎస్‌లోనూ ఇలాంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. కరీంనగర్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తర్వాత కారెక్కిన చల్మెడ లక్ష్మీ నరసింహారావు  వేములవాడలో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మరీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పరిస్థితి ఏంటనేది ప్రశార్థకంగా మారింది.

ఉమ్మడి జిల్లాలో పార్టీలకతీతంగా రాజకీయ నాయకులంతా జనం బాట పట్టారు. మంత్రుల్లో కేటీఆర్ సమయం దొరికినప్పుడల్లా సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు ఎక్కువగా జనాల్లోనే ఉంటున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా గజ్వేల్‌పై దృష్టి పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈటల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. రసమయి బాలకిషన్ ప్రతి రోజూ ఏదో ఒక ఊర్లో దర్శనం ఇస్తున్నారు. రామగుండంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా హడావుడి చేస్తున్నారు. మంథని ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ లేదనే చెప్పాలి.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటూ రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా సమయం చిక్కినప్పుడల్లా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా పార్లమెంటరీ నియోజక వర్గంలో పాదయాత్రలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీల నేతలు ముందుగానే తమ తమ నియోజక వర్గాల్లో హల్ చల్ చేస్తున్నారు. చరిత్ర తిరగరాసిన నేతలు.. విలక్షణ తీర్పులు ఇచ్చిన కరీంనగర్ జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికల నాటికి ఎవరెవరి జాతకాలు ఎలా మార్చుతారో చూడాలి. 
 

మరిన్ని వార్తలు