తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులకు ప్లాన్‌ రెడీ: పొంగులేటి వ్యాఖ్యలు

8 Nov, 2023 11:01 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చే తామే అంటూ కామెంట్స్‌ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఎన్నికల వేళ తెలంగాణలో ఐడీ, ఈడీ దాడులు జరుగుతాయని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి. దీంతో, ఆయన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. 

వివరాల ప్రకారం.. పొంగులేటి శ్రీనివాస్‌ బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులు జరుగుబోతున్నాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై దాడికి సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయంతోనే దాడులకు ప్లాన్‌ చేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకి కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత బీఆర్‌ఎస్‌ సూచనల మేరకు కేంద్ర సంస్థలు నామీద, నా కుటుంబ సభ్యుల మీద, నాకు మద్దతిచ్చే వారిపై దాడులు చేసేందుకు రెడీ అవుతున్నారు. 

కాళేశ్వరం ఖేల్‌ ఖతం..
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అద్భుతమని కేసీఆర్‌ ప్రగల్భాలు పలికారు. కానీ, కాళేశ్వరం నిజ స్వరూపమేంటో కేంద్రం నివేదికల్లో వెల్లడించింది. కాళేశ్వరంలో కేసీఆర్‌ అవినీతికి పాల్పడినట్టు అర్థం అవుతోంది. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల ఏదో ఒకరోజు కూలిపోతాయి. కాళేశ్వరాన్ని కేసీఆర్‌ ఏటీఎంలా వాడుకున్నారని చెప్పిన బీజేపీ.. ఆయన్ను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు. కేసీఆర్‌ను ఎందుకు విచారించడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను మాయం చేసే అవకాశం ఉంది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్‌ చేశారు. 

ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రియాంక, రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారు. తెలంగాణలో దొరల పాలన వద్దు. ప్రజల పాలన కావాలి. ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవబోతున్నారు. తెలంగాణ పోలీసులు వారి పరిధిలో పార్టీలకు అతీతంగా నడుచుకోవాలని సూచించారు. 

ఇది కూడా చదవండి: తప్పు చేసిన వారిని వదలం.. మోదీ ఫైర్‌

మరిన్ని వార్తలు