'పొట్టివాడే కానీ..' సింథియాపై ప్రియాంక గాంధీ ఫైర్‌

15 Nov, 2023 18:53 IST|Sakshi

భోపాల్‌: బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సింథియాను ద్రోహిగా పేర్కొన్నారు. యూపీలో గతంలో ఎన్నికల ప్రచారంలో సింథియాతో కలిసి పనిచేసిట్లు చెప్పిన ప్రియాంక గాంధీ.. పొట్టిగానే ఉంటాడు కానీ.. అహంకారం మాత్రం చాలా ఎక్కువని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని దాతియాలోని ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.  

'ఎవరు ఆయన వద్దకు వెళ్లినా మహారాజ్‌ అని పిలవాలి. లేకపోతే ఆయన పెద్దగా స్పందించరు. మన సమస్యలు పరిష్కరించరు. ఈ రకమైన కుటుంబ సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తున్నారు. కానీ గ్వాలియర్, చంబా ప్రజలకు మాత్రం సింథియా ద్రోహం చేశారు.' అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సింథియా కూడా కాంగ్రెస్‌పై ఇటీవల తీవ్రంగా ఆరోపణలు చేశారు. మహిళలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లో విఫలమయ్యారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పతనమైందని అన్నారు. 

2018లో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ సీఎం సీటు విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. కమల్‌నాథ్‌కు సీఎం పదవి ఇవ్వడంలో సింథియాను ఒప్పించింది అధిష్ఠానం. కానీ కొన్ని నెలల్లోనే సింథియా అసంతృప్తితో బీజేపీ గూటికి చేరారు. 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. మధ్యప్రదేశ్‌ ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి. ఈ క్రమంలో నేడే ప్రచారానికి తెరపడింది.  

ఇదీ చదవండి: Madhya Pradesh Election: ఎన్నికల ప్రచారం ఆఖరి క్షణంలో ఖర్గే సభ రద్దు!

మరిన్ని వార్తలు