మణిపూర్‌ మండుతూ ఉంటే పార్లమెంట్‌లో జోకులా?

12 Aug, 2023 04:03 IST|Sakshi

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: మణిపూర్‌ హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని మరోసారి టార్గెట్‌ చేశారు. గురువారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి బదులిస్తూ ప్రధాని మోదీ నవ్వడం, జోకులు వేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని ప్రవర్తన సరైంది కాదన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మోదీ మణిపూర్‌ హింసను తక్షణం ఆపాలనుకుంటే, అందుకు అవసరమైన చాలా మార్గాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పారు. భారత ఆర్మీ అక్కడి పరిస్థితులను రెండు రోజుల్లోనే అదుపులోకి తీసుకొస్తుందని చెప్పారు.

‘అక్కడ మహిళలు, చిన్నారులు చనిపోతున్నారు. మహిళలు వేధింపులు, అత్యాచారాలకు గురవుతున్నారు. భారత ప్రధాని మోదీ మాత్రం నిండు పార్లమెంట్‌లో రెండు గంటలపాటు నవ్వుతూ, నవి్వస్తూ, నినాదాలతో గడిపారు. నాలుగు నెలలుగా మణిపూర్‌ మంటల్లో ఉన్న విషయం ఆయన మర్చిపోయినట్లున్నారు. మణిపూర్‌ మండుతూనే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, మంటలను ఆపడం ప్రధానికి ఇష్టం లేదు’అని రాహుల్‌ ధ్వజమెత్తారు.

ఈ విషయం రాహుల్‌ గాం«దీకి, కాంగ్రెస్‌కు, ప్రతిపక్షానికి సంబంధించింది కాదు, ఇది భారత్‌కు, మన దేశానికి సంబంధించిన విషయం. ఒక రాష్ట్రం నాశనమైంది. అదిప్పుడు ఉనికిలో లేదు. విభజించు, పాలించు, తగులబెట్టు..తరహా బీజేపీ రాజకీయాల వల్లే ఇలా అయింది’అని రాహుల్‌ మండిపడ్డారు. ‘నేను అటల్‌ బిహారీ వాజ్‌పేయి, దేవెగౌడ వంటి ప్రధానుల్ని చూశాను. మోదీ వంటి ఇంత దిగజారిన ప్రధానిని ఎన్నడూ చూడలేదు’అన్నారు. ‘మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైంది’అని నేను చేసిన వ్యాఖ్య సాధారణమైంది కాదు.

నా 19 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి మాట వాడటం ఇదే మొదటిసారి’అని అన్నారు. మణిపూర్‌లోని మొయితీలుండే ప్రాంతానికి వెళ్లినప్పుడు.. వాళ్లు మమ్మల్నెంతో ప్రేమగా చూశారు. అక్కడే ఉండిపొమ్మన్నారు. అక్కడున్న భద్రతా సిబ్బంది ఒక్క కుకీ వర్గం వ్యక్తి కూడా లేరు. కుకీలుండే ఏరియాకు వెళ్లినప్పుడూ మాకు ఇదే అనుభవం ఎదురైంది. అక్కడ ఒక్కడి భద్రతా సిబ్బందిలో ఒక్క మొయితీ కూడా లేరు.

ఇలాంటి పరిస్థితి మణిపూర్‌లో మునుపెన్నడూ లేదని కేంద్ర భద్రతా సిబ్బంది ఒకరు నాతో అన్నారు’అని రాహుల్‌ చెప్పారు. ‘అందుకే మణిపూర్‌లో భరతమాత హత్యకు గురైందన్నాను. అది తమాషాకు కాదు. వాస్తవమే చెప్పాను’అని రాహుల్‌ తెలిపారు. ‘పార్లమెంట్‌లో నా ప్రసంగంలోని భరతమాత అనే మాట దోషంగా భావించి రికార్డుల నుంచి తొలగించి వేశారు. అందులో తప్పేముంది? ఇలా భరతమాత మాటను తొలగించడం పార్లమెంట్‌ చరిత్రలోనే తొలిసారి’అని రాహుల్‌ పేర్కొన్నారు.

ప్రధాని హోదాకు తగని ప్రసంగం
గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్‌ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు