బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే నిరుద్యోగులది అడవి బాటే 

15 Nov, 2023 05:41 IST|Sakshi
స్టేషన్‌ఘన్‌పూర్‌ సభలో మాట్లాడుతున్న రేవంత్‌. చిత్రంలో అద్దంకి దయాకర్, అభ్యర్థి సింగపురం ఇందిర  

కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

వాళ్లు అన్నల్లో చేరితే ప్రభుత్వంలో ఒక్కరూ మిగలరు.. దొర కాళ్ల కింద తెలంగాణ నలిగిపోతోంది 

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వాళ్ల కరెంటు ఊడగొడతాం 

దేశమంతా కామారెడ్డి ప్రజల తీర్పు కోసం ఎదురు చూస్తోంది 

కాంగ్రెస్‌ను గెలిపించకపోతే నిజాం పాలన పునరావృతం 

సాక్షి, వరంగల్‌/జనగామ/ సాక్షి, కామారెడ్డి:  తెలంగాణ సాధన పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌కు మరోసారి పట్టం గడితే రాష్ట్రంలోని నిరుద్యోగులు అడవి బాట పట్టడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగాల కోసం పరీక్షల యుద్ధం చేస్తున్న నిరుద్యోగ యువత దిక్కుతోచక అటవీబాట పట్టే పరిస్థితి వస్తే, నక్సలైట్‌ ఉద్యమం పునరావృతమైతే.. ఈ  ప్రభుత్వంలో ఒక్కరూ మిగిలే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

1,200 మంది యువత ఆత్మ బలిదానాలకు చలించి కాంగ్రెస్‌ పార్టీ మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, కానీ కేసీఆర్‌ కుటుంబ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని ఆరోపించారు. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని ముందు వరుసలో ఉండి పోరుసల్పిన నిరుద్యోగులు..తెలంగాణ వచ్చినా ఉద్యోగ నియమాకాలు లేక వయోపరిమితి మించిపోయి, చివరకు పెళ్లిళ్లు కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తరచూ పరీక్షల రద్దు, పేపర్‌లీక్‌ల వంటి దుష్పరిణామాలతో ఆత్మస్థైర్యం కోల్పోతున్న నిరుద్యోగులు ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించకపోతే నిజాం పాలనను కేసీఆర్‌ పునరావృతం చేస్తారని ఆరోపించారు. గజ్వేల్‌ భూములు కొల్లగొట్టి ఇప్పుడు కామారెడ్డికి వస్తున్నారని, దేశమంతా కామారెడ్డి ప్రజల తీర్పు కోసం ఎదురుచూస్తోందని అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో జరిగిన విజయభేరి సభల్లో, కామారెడ్డి జిల్లాలో పలు కార్నర్‌ మీటింగుల్లో ఆయన మాట్లాడారు.  

మీ కరెంట్‌ ఊడగొడతాం..ఫ్యూజులే ఉండవు 
    ‘త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దొర కాళ్ల కింద నలిగిపోతోంది, నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ చెప్పిండు. కానీ కాళేశ్వరం పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, సుందిళ్లకు దిక్కులేదు. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టిండు. నిజంగా ప్రమాదంతోనే ప్రాజెక్టు కూలితే ప్రజలకు ఎందుకు చూపించవు? కాంగ్రెస్‌ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్‌ అంటుండు. మూడోసారి మాకు అవకాశం ఇవ్వండి.. మా మనడిని మంత్రి చేసేది ఉందని అంటుండు.. బిడ్డా కాంగ్రెస్‌ రాగానే నీతో పాటు కేటీఆర్, హరీశ్, సంతోష్, దయాకర్‌రావు, కవితారావుల కరెంట్‌ ఊడగొడతాం...మీకు ఫ్యూజ్‌లే ఉండవు.మీ మోటార్లు కాలుతాయ్‌.. మీ ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతాయ్‌..’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. 

పులిని షికారు చేసేందుకు వచ్చిన వేటగాన్ని..     
    ‘పేదలు నివాసం ఉండేందుకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇవ్వని కేసీఆర్‌.. గజ్వేల్‌లో 600 గదులతో గడీని నిర్మించుకుండు. జన్వాడలో 100 ఎకరాలలో కోట్లు ఖర్చు పెట్టి ఒక గడీని కట్టుకుండు. ప్రజల రక్తాన్ని తాగుతున్న పులిని షికారు జేసేందుకు వచ్చిన వేటగాన్ని నేను. గజ్వేల్‌ భూములను కొల్లగొట్టిన కాలకేయ ముఠా ఇప్పుడు కామారెడ్డి మీద కన్నేసింది. ఇక్కడి ప్రజలకు చెందిన విలువైన భూములను కొల్లగొట్టేందుకు వస్తున్నరు.

వాళ్ల బారి నుంచి కాపాడేందుకు ఇక్కడికి వచ్చిన. మీరు అండగా నిలవండి. మీ భూములకు రక్షకుడిగా నేనుంటా. కామారెడ్డి ప్రాంత ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా ఏనాడూ పట్టించుకోని కేసీఆర్‌కు ఎలక్షన్లు రావడంతో తల్లి ఊరు గుర్తుకువచ్చింది. గజ్వేల్‌లో ఓడిపోతా అనుకుంటే సిద్దిపేటకో, సిరిసిల్లకో పోకుండా కామారెడ్డికి రావడంలోనే మతలబు ఉంది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి రైతుల భూములపై కన్నేస్తే, కనుగుడ్లను పీకి గోలీలాడుతాం..’ అని హెచ్చరించారు.  

కేసీఆర్‌ పండించిన వడ్లకు రూ.4,250?  
    ‘రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను క్వింటాల్‌ రూ.2 వేలకు కొనే దిక్కులేదు. అదే సీఎం కేసీఆర్‌ ఫాం హౌస్‌లో పండించిన వడ్లను క్వింటాల్‌కు రూ.4,250 చొప్పున ఓ సీడ్స్‌ కంపెనీ తీసుకుంది. దీనిపై రాజరాజేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా.?’ అని రేవంత్‌ సవాల్‌ చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలంటే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని అన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా సభల్లో ఏఐసీసీ అబ్జర్వర్‌ అరవింద్‌ కుమార్‌ బాల్వి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌అలీ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్, శోభారాణి, ఎరబ్రెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు