మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్‌కు మీరు ఓ లెక్కా: రేవంత్‌రెడ్డి

20 Nov, 2023 16:13 IST|Sakshi

సాక్షి,నర్సాపూర్‌ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో జరిగిన బహిరంగసభలో రేవంత్‌ మాట్లాడారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే మదన్ రెడ్డి , కేసీఆర్ స్నేహితులు అంటారు. మదన్‌ రెడ్డికి  టికెట్ ఇవ్వకుండా మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్‌కు మీరు ఓ లెక్కా. మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే. పార్టీ ఫిరాయించిన సునీతా లక్ష్మా రెడ్డికి కేసీఆర్‌ టికెట్ ఇచ్చారు. 

ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల జోన్‌లో కలిపి నిరుద్యోగులను మోసం చేశారు. మేం అధికారంలోకి వస్తే చార్మినార్ జోన్‌లో కలిపే అవకాశాన్ని పరిశీలిస్తాం. నర్సాపూర్ గడ్డ..లంబాడీల అడ్డ మేం అధికారంలోకి వస్తే తండాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు బంగారు పళ్లెంలో తింటూ బంగారు తెలంగాణ అంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో, బెల్టు షాపుల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌ చేసిండు కేసీఆర్. పార్టీ మారి మోసం చేసిన సునీతా లక్ష్మా రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఆమె కోసం ప్రచారం చేస్తే నాపై కేసులు పెట్టారు. ఆమె మాత్రం కేసీఆర్ పార్టీలో చేరారు. 

నమ్మక ద్రోహులు ఎవరైనా సరే బండకేసి కొట్టాలి. అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులకు, గిరిజనులకు భూములు పంచి ఇచ్చిన రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం 12 లక్షల పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం నాగార్జున సాగర్, శ్రీ శైలం కట్టింది. ఇందిరమ్మ రాజ్యం ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది. ఇందిరమ్మ రాజ్యం రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర నువు బిచ్చం ఎత్తుకుని బతికేటోడివి’ అని రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. 

ఇదీచదవండి..కాంగ్రెస్‌ తెచ్చేది భూ మాత కాదు..భూ మేత : కేసీఆర్‌

మరిన్ని వార్తలు