సొంత కంపెనీల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన సీఈవోలు - స్టీవ్ జాబ్స్ నుంచి శామ్ ఆల్ట్‌మాన్ వరకు..

20 Nov, 2023 16:13 IST|Sakshi

ఇటీవల ఓపెన్ఏఐ కంపెనీ తన సీఈఓ 'శామ్‌ ఆల్ట్‌మన్‌'ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద చర్చలకు దారి తీసింది. సీఈఓ జాబ్ కూడా గ్యారెంటీ కాదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

2022లో 969 మంది సీఈఓలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయగా.. ఈ ఏడాది మొదటి తొమ్మిది ఈ సంఖ్య 1425 కు చేరింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Statistics) ప్రకారం, తాము నెలకొల్పిన సంస్థల నుంచి తమ సీఈఓ పదవులు కోల్పోయిన వారు ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

స్టీవ్ జాబ్స్ (Steve Jobs)
యాపిల్ కంపెనీ కో ఫౌండర్, సీఈఓ స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు ఆ కంపెనీలోనే తన సీఈఓ జాబ్ కోల్పోయిన సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. సంస్థ ప్రారంభమైనప్పుడు అతని వయసు 21 సంవత్సరాలు మాత్రమే, అయితే ఆ కంపెనీ స్థాపించిన సుమారు 9 సంవత్సరాలకు కంపెనీ బోర్డు సీఈఓగా తొలగించి, ఆ స్థానంలో జాన్ స్కూల్లేను నియమించింది. ఆ తరువాత 1997లో స్టీవ్ జాబ్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. ఈయన 2011లో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ స్థానంలో 'టిమ్ కుక్' ఉన్నారు.

అంకితి బోస్ (Ankiti Bose)
జిలింగో కో-ఫౌండర్, సీఈఓ అంకితి బోస్ కొన్ని ఆర్ధిక అవకతవకల దర్యాప్తు కారణంగా 2022లో సీఈఓగా తొలగించారు. బోర్డు ఆమోదం లేకుండానే.. ఆమె జీతం దాదాపు 10 రెట్లు పెరగటం కారణంగా సీఈఓగా తొలగించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారింది.

పరాగ్ అగర్వాల్ (Parag Agrawal)
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) సంస్థను కొనుగోలు చేసిన తరువాత కంపెనీలో చాలామంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. 2021లో సీఈఓగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ ఆ సమయంలో కంపెనీని విడిచిపెట్టిన మొదటి వ్యక్తి. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్‌ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. 

ఫనీష్ మూర్తి (Phaneesh Murthy)
ప్రముఖ ఐటీ సంస్థ 'ఐగేట్' (iGate) ప్రెసిడెంట్, సీఈఓ ఫనీష్ మూర్తికి తన సహోద్యోగితో సంబంధం ఉందనే కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అరాసెలి రోయిజ్ అనే ఉద్యోగి లైంగిక వేధింపుల దావా వేసినప్పుడు విచారణంలో దోషిగా తేలడం వల్ల ఈయన సీఈఓగా తొలగించారు. ఈయన ఇన్ఫోసిస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు సమాచారం.

జాక్ డోర్సే (Jack Dorsey)
2006లో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ స్టార్టప్ ట్విటర్‌ కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జాక్ డోర్సే' 2008లో కొన్ని కారణాల వల్ల తన పదవి కోల్పోయాడు. ఆ తరువాత ఆయన స్థానంలోకి ప‌రాగ్ అగ‌ర్వాల్ నియమితుడై సీఈఓ బాధ్యతలు చేపట్టారు.

శామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman)
సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్‌ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్‌ ఆల్ట్‌మన్‌'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది.

ఇదీ చదవండి: ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే..

తమ కంపెనీలలోనే సీఈఓ పదవి కోల్పోయిన వ్యక్తుల జాబితాలో యాహూ సీఈఓ కరోల్ బార్ట్జ్‌ (2011), హెచ్‌టీసీ సీఈఓ పీటర్ చౌ (2015), తైవాన్‌కు కంప్యూటర్ కంపెనీ ఏసర్ సీఈఓ జియాన్‌ఫ్రాంకో లాన్సి (2011), విప్రో జాయింట్ సీఈఓలు గిరీష్ పరంజ్పే & సురేష్ వాస్వానీ (2011), మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీఫెన్ ఎలోప్, హెచ్‌పీ సీఈఓ మార్క్ హర్డ్ (2010) ఉన్నారు.

మరిన్ని వార్తలు