కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం

6 Nov, 2023 03:36 IST|Sakshi

పెద్దపల్లి ప్రజా ఆశీర్వాదసభలో బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ 

పెద్దపల్లిరూరల్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగిన సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబసభ్యులను జైలు కు పంపడం ఖాయమని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రూ.లక్షన్నర కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోతోందని, అందుకు కల్వకుంట్ల కుటుంబసభ్యులే కారకులని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన నిరుద్యోగ యువతశక్తిని నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఏంచేయాలో తెలియక విద్యావంతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రతి ఏటా రంజాన్‌ పండుగకు ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేసుడే తప్ప మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేనిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇఫ్తార్‌ విందులు కావు.. న్యాయం కావాలని మైనారిటీలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు ఈర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు