అందరికీ మేలే సీఎం జగన్‌ లక్ష్యం

26 Jul, 2021 04:24 IST|Sakshi

బీసీలు బలమైన వర్గాలుగా ఎదగాలి

భట్రాజు కులస్తుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల

సాక్షి, అమరావతి: అసమానతలు లేని సమ సమాజ నిర్మాణమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. భట్రాజు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కూరపాటి గీతాంజలి దేవి అధ్యక్షతన ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భట్రాజు కులస్తుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల్లోని చివరి వారికి కూడా మేలు జరగాలని సీఎం జగన్‌ ఆకాంక్షిస్తున్నారన్నారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. ఇటు పార్టీ పదవులు, అటు  నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. కార్పొరేషన్‌లు ఆయా కులాలకు గుర్తింపును తెచ్చి.. వారిలో చైతన్యాన్ని, భవిష్యత్తు పట్ల ఆశను నింపాయన్నారు. రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రాజ్యమేలుతోందన్నారు. దీన్ని అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో బీసీలు బలమైన వర్గాలుగా ఎదగాలని కోరారు. 

చంద్రబాబులా రాజకీయ ఎత్తులు వేస్తే.. 
చంద్రబాబులా రాజకీయ ఎత్తులు వేస్తే అధికారంలోకి రావడం చాలా సులువని.. కానీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఇందుకు భిన్నం అని సజ్జల చెప్పారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుని అధికారంలోకి రావాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్న పథకాల అమలు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి, మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు