వైరల్‌ వర్సెస్‌ రియల్‌: వీరి పరిస్థితి ఎంత దయనీయమో?

8 Nov, 2022 19:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న వివిధ స్కీములు, కార్యక్రమాలకు పోటీగా కొత్త ఆలోచనలు చేయలేక సతమతమవుతున్న టిడిపి, జనసేనలు ప్రజల దృష్టిని మళ్లించడానికి సానుభూతి రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నట్లుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నివాసం ఎదుట తాగుబోతులు చేసిన వీరంగాన్ని హత్యాయత్నంగా ప్రచారం చేసుకోవడాన్ని గమనించినా, నందిగామ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై గులకరాయితో హత్యయత్నం చేశారని చెప్పడాన్ని పరిశీలించినా అలాంటి అభిప్రాయమే కలిగిస్తుంది.

పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు తాగుబోతులు గొడవపడ్డారు. ఆయన ఇంటి వద్ద కారు ఆపడం, దానిని పవన్ సెక్యూరిటీవారు అభ్యంతరం చెప్పడం, ఆ సందర్భంగా జరిగిన వాదులాట.. ఇదంతా పెద్ద రెక్కీగాను, ఏకంగా పవన్‌ను హత్య చేయడానికి 250 కోట్ల సుపారి ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేసి అదంతా న్యూసెన్స్ కింద తేల్చేసినా పవన్ కళ్యాణ్ కాని, ఆయనను తమ ట్రాప్‌లో ఉంచుకుంటున్న టీడీపీ నేతలు కానీ అబ్బే అది హత్యాయత్నమే అని చెప్పి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. దీనిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఖండిస్తూ సుపారీ కింద రూ.250 కోట్లు అని చెబుతున్నారని, ఆ 250 కోట్లు పవన్‌కు ప్యాకేజీగా ఇస్తే ఆయనే తమ పార్టీకి మద్దతు ఇస్తారుగా అని ఎద్దేవా చేశారు.

అలాగే కేఏ పాల్ మునుగోడులో చేసిన హడావుడి మాదిరిగానే పవన్ ఆయనతో పోటీ పడుతున్నారని కూడా నాని వ్యాఖ్యానించారు. విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఇంటివద్ద రెక్కీ అంటూ జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా హడావుడి చేయడం, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి మరీ  ఈ ఆరోపణ చేయడం. నిజంగానే ఒకవేళ ఎవరైనా పవన్ కళ్యాణ్‌పై దాడికి ప్రయత్నిస్తే కచ్చితంగా తప్పు. పోలీసులు పూర్తి భద్రత కల్పించాలి. కానీ అసలు అదంతా తాగుబోతుల గొడవ అని తెలంగాణ పోలీసుల విచారణలో తేలిన తర్వాత కూడా పవన్‌తో సహా టిడిపి వారంతా దీనిపై ఆరోపణలు చేయడం అంటే, వీరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

పవన్‌తో ఎవరికి పని?
పవన్ కళ్యాణ్‌ది ఒక చిన్న రాజకీయ పార్టీ. ఆ పార్టీ ఓట్లు కాస్త అయినా తమకు తోడైతే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అన్న ఆశతో పవన్ తో జతకట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ కలిసినా వైసిపికి గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతం అధికమే అన్న సంగతి తెలిసిందే. పైగా గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేసి పరాజయం చెందారు. ఆయన పార్టీ కేవలం ఒకే సీటు గెలుచుకుంది.

అయినా పవన్‌కు ఎందుకు ప్రాధాన్యం వస్తున్నది? అంటే ఆయన వెనుక కాపుకులానికి చెందిన ఓటర్లు కొంత అధికశాతం మొగ్గు చూపుతున్నారేమోనన్న భావం, తెలుగుదేశం మీడియాలుగా గుర్తింపు పొందిన ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 వంటి సంస్థలు పవన్‌ను పైకి ఎత్తే క్రమంలో ఆయన ఏమి మాట్లాడినా అత్యంత ప్రాముఖ్యం ఇచ్చి ప్రచారం చేస్తుండడం కావచ్చు. గత ఎన్నికలలో కాపునేతలు ఎవరూ జనసేన పక్షాన గెలవలేదు. వైఎస్సార్‌సీపీ తరపున 27 మంది నెగ్గారు. ఆ విషయం కూడా గమనించవలసి ఉంటుంది. 

లక్ష్యం బురద జల్లడం..!
సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం కాపునేస్తం, చేయూత స్కీమ్‌ కింద కాపు మహిళలకు పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం అందిస్తోంది. వారంతా సహజంగానే వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానిని చెడగొట్టడం కోసం చంద్రబాబుకాని, పవన్ కాని రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. ఏ చిన్న ఘటన జరిగినా దానిని చాలా పెద్ద విషయంగా పోకస్ చేసే పనిలో పడుతున్నారు.

ఇక ఇప్పటం సంగతి చూడండి. ఆ గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం రోడ్డుపక్కన ఉన్న ఆక్రమణలను తొలగించడాన్ని పవన్, చంద్రబాబులు తప్పు పడుతున్నారు. దానికి రకరకాల రంగులు పూస్తున్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చారన్న కోపంతో ఆ గ్రామంలోని జనసేన మద్దతుదారుల ఇళ్లు కూల్చారని ప్రచారం సాగించారు. తీరా చూస్తే ఇళ్లను కూల్చడం కాదు. ఆక్రమణలలో ఉన్న ప్రహరీగోడలను తొలగిస్తే అదే ప్రపంచ సమస్యగా చూపించే యత్నం చేయడం, ప్రభుత్వం ఒకపక్క 31 లక్షల ఇళ్ల నిర్మాణం పేదల కోసం చేస్తుంటే, ఇక్కడ ఇళ్లు ఎందుకు కూల్చుతుంది? ఒకవేళ ఎవరైనా పేదలకు నష్టం కలిగితే, ఆ మేరకు ప్రభుత్వాన్ని పరిహారం ఇప్పించాలని కోరవచ్చు. ఒకవేళ రోడ్ల విస్తరణ అవసరం లేదని వారు అనుకుంటే అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేయవచ్చు. లేదా ఒక ప్రకటన ఇచ్చి బాధితులను ఆదుకోవాలని కోరవచ్చు. గతంలో నేతలు అలాగే వ్యవహరించేవారు.కాని ఇప్పుడు స్టాండర్డ్స్ లేని నేతలు పార్టీలు నడుతున్నారని అనుకోవాలి. ప్రతిదానిని రాజకీయ అవవసరాలకు వాడుకోవాలనే దుర్భుద్దితో నానా హంగామా చేశారు.

ఇది పీకే మార్కు నటన
పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వీరంగం వేశారు.ఆయన మంగళగిరి పార్టీ ఆపీస్ నుంచి బయల్దేరితే పోలీసులు అడ్డుకున్నారట. వారు ఆ పని చేయకుండా ఉండాల్సింది. పోలీసులు వద్దంటున్నారన్న నేపంతో ఆయన కాలినడకన బయల్దేరారు. తదుపరి పోలీసులు ఒప్పుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కారులో కూర్చుకుండా కారుపైన ఎక్కి అచ్చం అదేదో సినిమాలో నటించినమాదిర వ్యవహరించారు. పొరపాటున పవన్ జారితే మళ్లీ పోలీసులపైన, వైఎస్సార్‌సీపీపైన ఆరోపణలు చేసి ఉండేవారు.

ఈ క్రమంలో పోలీసులను ఉద్దేశించి పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు రేప్ చేసినవారిని రక్షిస్తున్నారట. ఇంకా ఏవేవో మాట్లాడారు. ఇది గూండారాజ్యమట. దీనిని కూల్చివేస్తారట. ఇలా ఒకటికాదు. సినిమా డైలాగులు చెప్పిన తీరు చూస్తే పిచ్చి కుదిరింది.. తలకి రోకలి చుట్టండి అన్న చందంగానే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటన వార్తలకు ఈనాడు వంటి పత్రిక ఏకంగా బానర్ గా కధనంగా ఇచ్చిన తీరు గమనించండి. ఇదంతా టిడిపి,జనసేన, ఈనాడు తదితర మీడియా సంస్థల మాచ్ ఫిక్సింగ్ వ్యవహారం అని ఇట్టే తేలిపోతుంది. ఈ మీడియా రోజూ నీచస్థితికి దిగజారీ ఏడుపుగొట్టు వార్తలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

బాబు బాట.. అబద్దాల మాట
ఇక చంద్రబాబు విషయానికి వద్దాం. ఆయన నందిగామ సభలో ఒక గులకరాయి తగిలి సెక్యూరిటీ అధికారికి ఒక చిన్న గాయం అయింది. అంతే వెంటనే చంద్రబాబు అందుకుని ఇంకేముంది తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించేశారు. టిడిపి మీడియా తానా అంటే తందానా అని సహజంగానే అంటుంది. ఎవరైనా హత్య చేయాలని అనుకునేవారు గులకరాయిని ప్రయోగిస్తారా? ఒకవేళ వైఎస్సార్‌సీపీ వ్యక్తి ఎవరైనా రాయి విసిరి ఉంటే ఆ పక్కనే ఉన్న టిడిపి కార్యకర్తలు వెంటనే అతనిని పట్టుకునేవారు కదా.. అలా చేయలేదంటే అక్కడకు వచ్చినవారు టిడిపి వారు కారా? డబ్బులు ఇచ్చి పోగుచేసుకు వచ్చినవారా? అదేదో పూలల్లో ఇరుక్కుని రాయి వచ్చి ఉండవచ్చని అంటున్నారు. దానిని ఈనాడు రక్తగాయం అంటూ ప్రచారం చేయడం వెనుక నీచ బుద్ది తెలుసుకోవడం కష్టం కాదు. ఇదంతా దేనికి? వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షతో వీరు రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. 

వైరల్‌ వర్సెస్‌ రియల్‌
సీఎం జగన్ చేపట్టిన స్కీములకు పోటీగా ఏమి చేయాలో, ఏమి చెప్పాలో వీరికి అర్ధం కావడం లేదు. అందుకే ఇలాంటి దిక్కుమాలిన సానుభూతి డ్రామాలకు, డైవర్షన్ రాజకీయాలకు తెరలేపి, ప్రజలలో వ్యతిరేకత పెంచాలన్న తాపత్రయంలో వీరు ఉన్నారు. వాస్తవంగా స్కీముల వల్ల లబ్ది పొందుతున్న ప్రజలు వీరి నాటకాలకు పడిపోతారా అన్నది ఆలోచిస్తే అంత తేలికకాదని చెప్పవచ్చు. కొసమెరుపు ఏమిటంటే గతంలో ఇప్పటం గ్రామానికి ఏభై లక్షల ఆర్దిక సాయం చేస్తానని తాను ఇచ్చిన హామీ గురించి పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకపోవడం.. ఇదండి పవన్ కళ్యాణ్ చిత్తశుద్ది.

- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు