న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచేలా ఎల్లో గ్యాంగ్‌ నానాయాగీ

19 Oct, 2023 17:30 IST|Sakshi

కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఏపీ ప్రభుత్వంపై విష ప్రచారాలు

అవినీతి ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏసీబీ కోర్టు ఆదేశాలతో జైలుకు వెళ్లారు. ఇది కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. ప్రజల నుండి స్పందన లేకపోయినా.. అర కొరగా టీడీపీ కార్యకర్తలు.. బాబు కుటుంబ సభ్యులు తాము పిలుపు నిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఎల్లో బ్యాచ్  నిరసనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును న్యాయవ్యవస్థ జైలుకు పంపింది. మరి బాబు కుటుంబం, టీడీపీ నేతలు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా? అని నిపుణులు నిలదీస్తున్నారు.

371 కోట్ల రూపాయల దోపిడీ జరిగిన స్కిల్ స్కాంలో  చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. జీవితంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ఏనాడూ కోర్టు గుమ్మం కూడా ఎక్కకుండా స్టేలు తెచ్చుకుని  తనపై అసలు విచారణలే జరక్కుండా చేసుకుంటూ చంద్రబాబు ఇన్నాళ్లూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. అయితే స్కిల్ స్కాంలో మాత్రం ఆయనకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

దీన్ని చంద్రబాబు నాయుడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన అవినీతిపై ఎన్నో కేసులు ఉన్నా ఏ ఒక్క కేసులోనూ  అరెస్ట్ కాకుండా తప్పించుకున్న తాను.. ఇపుడు జైలుకెళ్లాల్సి రావడం ఏంటి? అని ఆయన కుత కుతలాడిపోతున్నారు. చంద్రబాబు ఇలా జైలుకెళ్లి అలా  బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తారని బాబు బంధువులు, టీడీపీ నేతలు అనుకున్నారు.

అసలు అరెస్టే కారని అంతకు ముందు అనుకున్నారు. అయితే తమ అంచనాలు తప్పేయడంతో జైలుకెళ్లిన తర్వాత టీడీపీ నేతల్లో కొద్ది పాటి కంగారు మొదలైంది. న్యాయ విచారణలో చంద్రబాబు దోషిగా తేలితే తాను నిప్పు నిప్పు అని ఇంతకాలం అంటూ వస్తోన్న నినాదానికి కాలం చెల్లినట్లే అవుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతోన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే  బాబు అరెస్ట్ పైనా.. ఆయన్ను జైలుకు పంపడంపైనా నానా యాగీ చేయాలని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారు

స్కిల్ స్కాం కేసులోనూ తనపై విచారణ జరపకుండా కేసునే క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్లు వేశారు. మరో వైపు ముందస్తు బెయిల్‌కూ పిటిషన్లు వేసుకున్నారు. బెయిల్ రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకోవడంతో పాటు ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ మరింతగా మసకబారుతుందని భయపడ్డ టీడీపీ నాయకత్వం బాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలకు పిలుపు నిచ్చింది. న్యాయానికి సంకెళ్లు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తే ప్రజల నుంచి స్పందన రాలేదు. అక్కడక్కడా పార్టీ శ్రేణులో కార్యక్రమం చేశామంటే చేశాం అన్నట్లు మమ అనిపించేశారు.

అయితే ఈ నిరసనలు ఎవరిపైనా? అని న్యాయరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా  టీడీపీ అండ్ కో నినాదాలు చేస్తోంది. అయితే చంద్రబాబు నాయుడి కేసులో మొత్తం దర్యాప్తు చేసి  అక్కడ అవినీతి జరిగిందని కనిపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థలే. ఆ తర్వాత దోపిడీకి  సంబంధించి  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సాక్ష్యాధారాలతో చంద్రబాబును జైలుకు పింపింది ఏసీబీ న్యాయస్థానం.

ఇపుడు చంద్రబాబు తరపున ఆందోళనలు చేస్తోన్న వారు కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా? లేక ఆయన్ను జైలుకు పంపిన ఏసీబీ కోర్టు తీర్పుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారా? అని వారు నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలకు అనుమానాలు ఉన్నా  కేంద్రంలోని బీజేపీని ఏమీ అనలేకపోతున్నారు.

ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి దిగజారిన టీడీపీ నేతలు ఎవరిపై నిరసన వ్యక్తం చేయాలో అర్ధం కాక సతమతమవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు వెనుక ఉన్నది కేంద్రంలోని బీజేపీయే అని  చంద్రబాబుకు మద్దతు తెలిపిన సమాజ్ వాది పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించాయి. అయిటే టీడీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీ పేరు చెబితేనే భయపడిపోతోంది. ఎవ్వరినీ ఏమీ అనలేక ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌పై విష ప్రచారం చేస్తోందని పాలక పక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలంటే న్యాయ స్థానాలు బెయిల్ ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు మేథావులు. బాబును తక్షణమే విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వల్ల కానీ.. టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనల పేరిట అక్కడక్కడా హడావిళ్లు చేయడం వల్లకానీ చంద్రబాబు నాయుడు విడుదల అయ్యే అవకాశాలు లేనే లేవంటున్నారు న్యాయ రంగ నిపుణులు. బాబు విడుదల కోసం ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తోంది టీడీపీ. న్యాయస్థానాలే చంద్రబాబు విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకీ ఈ విషయం తెలుసు. కాకపోతే  ఏమీ తెలీనట్లు ఆయన  డ్రామాలు చేయిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
-సీఎన్‌ఎస్‌ యాజులు, సీనియర్‌ జర్నలిస్టు

మరిన్ని వార్తలు