రాబిన్‌శర్మ టీమ్‌ సర్వే: ఆ ఇద్దరి భవిష్యత్‌ ప్రశ్నార్థకమే.. సోమిరెడ్డి పరిస్థితి అంతే!

23 Nov, 2022 09:00 IST|Sakshi

నియోజకవర్గాల్లో టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్‌శర్మ టీమ్‌ సర్వే  

టీడీపీ మాజీలకు ప్రతికూల పరిస్థితులు 

సర్వే ఆధారంగా ప్రాధాన్యం ఇస్తానంటున్న అధినేత చంద్రబాబు 

అంతర్మథనంలో ఆశావహులు 

మూడు పర్యాయాలు వరుస ఓటమి చెందిన నేతలకు మొండిచేయి  

టీడీపీ అధినేత నిర్ణయంతో తమ్ముళ్లకు టికెట్‌ ఫీవర్‌ పట్టుకుంది. పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజాదరణలేదు. అధికార పార్టీ పై పైచేయి సాధించే సత్తా కొరవడిన నేపథ్యంలో సర్వే రిపోర్ట్‌ ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ధన బలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని అధినేత భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త టీమ్‌ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. అంతర్గత రహస్య సర్వేలో ఏ నియోజకవర్గంలోనూ టీడీపీ మాజీలకు సానుకూల పరిస్థితులు లేనట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో తమ భవిష్యత్‌ ఎలా ఉండబోతుందోనని టెన్షన్‌ పడుతున్నారు.    

సాక్షి, నెల్లూరు:  టీడీపీలో చక్రం తిప్పిన, క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీలకు రాబోయే ఎన్నికల్లో మొండి చేయి తప్పేటట్లు లేదు. క్షేత్రస్థాయిలో అధికార వైఎస్సార్‌సీపీ బలంగా ఉండడం, ప్రజాదరణ స్థిరంగా ఉండడం, టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికల బరిలోకి ‘కొత్త ముఖాలు’ వ్యూహానికి తెర తీయాలని ఆలోచనలో ఉన్నారు. ఇందు కోసం తమ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా రాబిన్‌ శర్మను నియమించుకున్నారు. ఆయన టీమ్‌ ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా సర్వే ప్రారంభించింది.

ఆ పార్టీ సీటింగ్‌ మాజీల పట్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన టీమ్‌ అధినేతకు సమాచారమిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సర్వే ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో ఇన్నాళ్లు రాబోయే ఎన్నికల్లో టికెట్‌ తమదేనని అనుకుంటున్న సీటింగ్‌ మాజీలతో పాటు ఆశావహులు సైతం అంతర్మథనంలో పడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డామనే భ్రమ మినహా అందలం ఎక్కే ఛాన్సు కోల్పోతున్నామనే బెంగ పట్టుకుంది. వరుస ఓటమి చెందిన నేతలకు ఈ దఫా టికెట్‌ లేదనే ఇప్పటికే స్పష్టం చేయడంతో జిల్లాలో చాలా మంది టీడీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. 

సోమిరెడ్డి పరిస్థితి అంతే..  
వరుసగా మూడు పర్యాయాలు ఒకే నియోజకవర్గంలో ఓటమి చెందిన నాయకులను ఈదఫా ప్రత్యక్ష ఎన్నికల్లో దూరంగా పెట్టాలనే దిశగా టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. టీడీపీ మహనాడులోనే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌  ఇదే విషయాన్ని బాహాటంగా వెల్లడించారు. ఈ కేటగిరీలో జిల్లాలో మొదటి స్థానంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఓటమి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉంటారు. ఈ దఫా ఆయనకు టికెట్‌ రావడం కష్టమేనని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.

జనవరి 27 నుంచి నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ  నాటికే నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికకు తుది రూపు తీసుకురావాలనే సంకల్పంతో టీడీపీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్‌శర్మ టీమ్‌ సర్వేలో సామాన్య ప్రజానీకంలో అధికార పార్టీ పట్ల ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదు. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్‌చార్జిలతో నిమిత్తం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్‌కు ధీటైన వారినే అభ్యర్థులుగా ప్రతిపాదించే అవకాశాలు అధికంగా ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

చదవండి: (పదే పదే క్లీన్‌బౌల్డ్‌.. ఇంతకీ కాంగ్రెస్‌ వ్యూహమేంటి?)

ఆ ఇద్దరి భవిష్యత్‌ ప్రశ్నార్థకమే..
తెలుగుదేశం పార్టీలో ఎదురులేదని భావిస్తూ వచ్చిన నాయకులకు ఈ దఫా టికెట్‌ విషయంలో భంగపాటు తప్పేటట్లు లేదు. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో నేరుగా సమీక్షించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఆశావహుల వారీగా సర్వే చేయిస్తున్నారు. పార్టీ పరంగా, ఆశావహుల వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఇద్దరికీ ఈ దఫా పార్టీ టికెట్‌ ఎంపిక ప్రశ్నార్థకంగా మారనుంది.

ఇద్దరికి కార్పొరేషన్‌ ఎన్నికలు ప్రతిబంధకంగా మారాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల వ్యక్తిగత ఇమేజ్‌ ముందు ఆ ఇద్దరు చాలా వెనుకబడినట్లు సమాచారం. ఇదే పరిస్థితి సర్వేపల్లి, కందుకూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కనిపిస్తున్నట్లు టీడీపీ సర్వే టీమ్‌ అధినేతకు నివేదిక అందించినట్లు తెలిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతల కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల్లో వ్యాపారాల్లో స్థిరపడిన వారి కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు