తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు: ఈ విషయాలు మీకు తెలుసా?

14 Oct, 2023 12:32 IST|Sakshi

తొలి ఎన్నికల్లోనే రెండు సభలకు ఎన్నికైన రావి నారాయణరెడ్డి

ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌  ఈసారి కొత్తగా ఎన్నికల సంఘం అవకాశం

 మీకు తెలుసా?

1952 ఎన్నికల సమయంలో తెలంగాణతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన కొన్ని జిల్లాలతో కలసి హైదరాబాద్‌ రాష్ట్రం ఉండేది. అప్పుడు ఈ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో తెలంగాణ వరకు చూస్తే కాంగ్రెస్‌కు 38 సీట్లు, పీడీఎఫ్‌ 36, సోషలిస్ట్‌ పార్టీకి 11, షెడ్యూల్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌కు మూడు సీట్లు రాగా ఇండిపెండెంట్లు ఏడుగురు గెలిచారు. అప్పట్లో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండేది. కాని ఆ పార్టీ వారంతా పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ పేరుతో ఎన్నికలలో పోటీచేశారు. అప్పట్లో సోషలిస్టు పార్టీ కూడా కాస్త బలంగానే ఉండేది. 

► 1956లో ఆంధ్ర, తెలంగాణ విలీనం అయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినా, 1957లో మాత్రం తెలంగాణ భాగానికే ఎన్నికలు జరిగాయి. దానికి కారణం 1955లో ఆంధ్ర రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు జరగడమే. ఆంధ్రలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు 1962 వరకు పదవిలో ఉండే అవకాశాన్ని పార్లమెంటు కలి్పంచింది. తెలంగాణలో 1957లో రెగ్యులర్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ 68, పీడీఎఫ్‌ 22, సోషలిస్టు 2, ప్రజాపార్టీ ఒకటి, ఎస్‌.సి.ఎఫ్‌ ఒకటి గెలుచుకోగా, ఇండిపెండెంట్లు పది మంది గెలిచారు.

తొలి ఎన్నికల్లోనే రెండు సభలకు ఎన్నిక 
సాక్షి, యాదాద్రి: తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో పీడీఎఫ్‌ పార్టీ తరఫున పోటీచేసి భువనగిరి ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంట్‌ సభ్యునిగా రావినారాయణరెడ్డి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచారు. భువనగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు.

రావి నారాయణరెడ్డి స్వగ్రామం బొల్లేపల్లి. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో ఉంది.  రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల తీరే వేరు. వారి రూటే సెపరేటు. అధికారంలోకి వస్తామన్న ధీమానో...కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదనే బెంగనో కానీ, కాంగ్రెస్‌ ఎంపీలు, మాజీ ఎంపీలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెగ ఉబలాటపడిపోతున్నారు. ఆఖరుకు కుమారుడి కంటే తనకే టికెట్‌ ముఖ్యమని, అన్ని కలిసి వస్తే మంత్రి పదవి దక్కుతుందని నగరానికి చెందిన ఓ మాజీ ఎంపీ భావిస్తూ, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు ఎంపీలేమో ఏకంగా సీఎం సీటునే ఆశిస్తున్నారు. బీజేపీకి పూర్తి భిన్నంగా కాంగ్రెస్‌ వైఖరి ఉందనే మాట వినిపిస్తోంది.

కాంగ్రెస్‌లో అందరూ పెద్దనాయకులే.. అందరూ సీఎం పదవికి పోటీదారులే. అందుకే వారంతా ఎప్పుడో మరో ఐదారు నెలలకు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల కంటే కూడా గడప ముందున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే సిద్ధమైపోతున్నారు. అన్ని బాగుండి అధికారంలోకి వస్తే... సరేసరి. ఒకవేళ ఓడిపోయినా.. తిరిగి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఎలాగూ ఉంటుందన్న ధీమా కాంగ్రెస్‌ నాయకుల్లో ఎక్కువ అన్న ప్రచారమూ ఉంది. ఇప్పుడున్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికై కాంగ్రెస్‌ వాణిని, రాష్ట్ర సమస్యలను గట్టిగానే వినిపించారన్న పేరు ఉంది.  


 
ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌  ఈసారి కొత్తగా ఎన్నికల సంఘం అవకాశం 

కరీంనగర్‌ అర్బన్‌: నామినేషన్‌కు సాంకేతికతను జోడించింది ఎన్నికల సంఘం. శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు ఇంట్లో నుంచే నామినేషన్‌ వేసేలా ఆన్‌లైన్‌లో వెసులుబాటు కల్పించింది. దీంతో అభ్యర్థులు స్వదేశం, విదేశం ఎక్కడి నుంచైనా నామినేషన్‌ దాఖలు చేయొచ్చన్న మాట. SUVIDHA.ECI.GOV.IN యాప్‌ ద్వారా నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కల్పించారు. నిర్దిష్ట విధానంలో సాధారణ నామినేషన్‌ తరహాలోనే ఎన్నికల కమిషన్‌ సూచించిన పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంది. దరఖాస్తు ఫారంలో దశలవారీగా అభ్యర్థుల వివరాలు పొందుపరచాలి. వివరాలన్నింటినీ సమర్పించిన తరువాత నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఉన్న నిర్ణీత సమయంలో స్లాట్‌లో సమయాలను బుక్‌ చేసుకోవాలి.

రిటర్నింగ్‌ అధికారిని నేరుగా కలిసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వివరాలతో కూడిన పత్రాలు మూడుసెట్లు అందించాల్సి ఉంటుంది. నామినేషన్‌ చివరి రోజు లోపుగా ఆన్‌లైన్‌ సెట్లను తప్పనిసరిగా అందించాలి. రిటర్నింగ్‌ అధికారికి నేరుగా అందిస్తేనే నామినేషన్‌ దాఖలు చేసినట్లుగా భావిస్తారు. ఆ తరువాత నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటి విషయంలో నేరుగా అభ్యర్థులు లేక వారి తరఫు ప్రతినిధులు హాజరు కావాల్సి ఉంటుంది.   

మరిన్ని వార్తలు