నియోజకవర్గ సమస్యపై స్పందిస్తే, ఎంపీని అరెస్టు చేస్తారా? 

1 Aug, 2022 01:39 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న బండి సంజయ్‌ చిత్రంలో రామచంద్రరావు తదితరులు 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావును అరెస్టు చేయడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సొంత నియోజకవర్గం పరిధిలోని బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

‘విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లరు, వేరేవాళ్లను వెళ్లనీయరు’అని విమర్శించారు. బాబూరావును ఎందుకు అరెస్టు చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దీనావస్థలో కేసీఆర్‌ ఉన్నారన్నారు. బాబూరావును అరెస్టు చేయొద్దని బీజేపీ కార్యకర్తలు కోరినందుకు వారిపైకి పోలీసు జీపులు ఎక్కిస్తూ చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిర్మల్‌ జిల్లా మన్మధ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు.

చాలామంది పోలీసులకు కేసీఆర్‌ నైజం తెలిసిపోయి నిజాయితీగానే వ్యవహరిస్తున్నారని, కానీ కొంతమంది మాత్రం టీఆర్‌ఎస్‌ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ బాసర విద్యార్థులు సంయమనంతో ఉన్నారని, ప్రభుత్వం, సీఎం మొద్దునిద్రలో ఉన్నారని తెలిసే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్నారని సంజయ్‌ అన్నారు. బాబూరావును వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.   

మరిన్ని వార్తలు