కులగణనకు నాంది 

14 Nov, 2023 04:36 IST|Sakshi

రేపు 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన ప్రారంభం 

3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొదలు 

రెండు రోజులు ప్రయోగాత్మకంగా కులగణన.. కుల గణనపై ఈ నెల 22 వరకు శిక్షణ 

బుధవారం నుంచే జిల్లా స్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశాలు 

విశాఖ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనకు బుధవారం నాంది పలకనుంది. రాష్ట్రంలో ఐదు సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా కుల గణన చేపట్టనుంది. బుధ, గురువారాల్లో రెండు రోజులు గ్రామీణ ప్రాంతాల్లో మూడు గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో రెండు వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సంబంధిత జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో కుల గణన చేపట్టడానికి ఈ నెల 3న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

కుల గణన ముందస్తు షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి ఎం. గిరిజా శంకర్‌ ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్న వివిధ శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు తెలియజేస్తూ యూవో నోట్‌ విడుదల చేశారు. ముందస్తుగా ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో అవసరమైతే మార్పులు చేసి, పూర్తిస్థాయిలో కులగణన చేపట్టనున్నట్లు సమాచారం. 

సిబ్బందికి శిక్షణ 
రాష్ట్రవ్యాప్తంగా కుల గణనలో ఎన్యూమరేటర్లుగా వ్యవహరించే సచివాలయాల సిబ్బందితో పాటు సూపర్‌వైజర్లు, మండల, మున్సిపల్‌ స్థాయి అధికారులు, పర్యవేక్షణ చేసే జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులకు మూడు విడతల్లో ఈ నెల 22 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చే మాస్టర్‌ ట్రైనర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్వంలో మంగళ, లేదా బుధవారం శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

రేపటి నుంచే రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు 
కుల గణనపై ప్రభుత్వం బుధవారం నుంచి జిల్లాలవారీగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించనుంది. బుధ, గురువారాల్లో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత  భాగస్వామ్యులతో ఈ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత ఐదు ప్రాంతీయ స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో, 20న విశాఖ, విజయవాడలో, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రాంతీయ సదస్సులు జరిగే ఐదు జిల్లాల్లో ప్రత్యేకంగా జిల్లా స్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశాలు ఉండవని రాష్ట్ర ప్రణాళిక శాఖ స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు