కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు

2 Apr, 2022 03:41 IST|Sakshi
దళితబంధు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ట్రాక్టర్‌ను నడుపుతున్న మంత్రి హరీశ్‌రావు 

బీజేపీపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ. ప్రజలు ఆ పార్టీపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్టీ నేతలది నరుకుడు ఎక్కువ.. పని తక్కువ. వంట గ్యాస్‌ సబ్సిడీ ఎత్తేసి సిలిండర్‌ ధరను రూ. వెయ్యికి పెంచారు. ఎన్నికలప్పుడు పెట్రో ధరలను తగ్గించి ఆ తర్వాత లీటరుకు రూ. వంద దాటించారు. పీఎఫ్‌ సొమ్ముపై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు’ అని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై మండిపడ్డారు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌తోపాటు బీజేపీపాలిత రాష్ట్రాల్లో కరెంట్‌ కోతలపై తెలంగాణ బీజేపీ నేతలు బదులివ్వాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో దళితబంధు లబ్ధిదారులకు ఆయన యూనిట్లను పంపిణీ చేశారు.

వైన్‌ షాపుల గల్లాపెట్టెపై దళితులు..
దళితుల సంక్షేమం కోసం దళితబంధు వంటి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ కాంట్రాక్టుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తోందని హరీశ్‌రావు చెప్పారు. ఆస్పత్రుల్లో డైట్‌ కాంట్రాక్టులు, మెడికల్‌ షాపులు, ఫెర్టిలైజర్‌ షాపులతోపాటు మద్యం దుకాణాల కేటాయింపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, దీంతో దళితులు వైన్‌ షాపుల గల్లాపెట్టె మీద కూర్చొనే అవకాశం కలిగిందని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్‌లో దళితబంధుకు రూ. 17,800 కోట్లు కేటాయించామని, ఈ పథకం ద్వారా ఈ ఏడాది 2 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, మండలి మాజీ ప్రొటెంౖ చెర్మన్‌ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు