బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం: మంత్రి గంగుల 

15 Aug, 2022 02:21 IST|Sakshi

ఉప్పల్‌ (హైదరాబాద్‌): తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఉప్పల్‌ బగాయత్‌లో శనివారం సోమవంశ సహస్రార్జున క్షత్రియ కులసంఘం ఆత్మ గౌరవ భవనం భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకులాభరణం కృష్ణమోహన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ 41 కుల సంఘాలకు రూ.95.25 కోట్ల విలువ గల 82.3 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.

దీంతో పాటు 25 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిపోయిన బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని ప్రశంసించారు. 19 నుంచి 281 అత్యున్నత స్థాయి బీసీ గురుకులాలు, 791 బీసీ హస్టళ్లు, కల్యాణలక్ష్మి అందజేసి అందరికీ మేనమామగా గుర్తింపు పొందారన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోందని తెలిపారు. క్షత్రియ సమాజ ప్రతినిధులు మంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్షత్రియ సమాజ అధ్యక్షుడు విశ్వనాథ్, రవీందర్, శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు