Bharat Ratna for Sr. NTR: ఎన్టీఆర్‌ అభిమానుల కోపం ముమ్మాటికీ సరైందే!

24 Jan, 2024 09:56 IST|Sakshi

నటనతోనే కాదు.. తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ముఖ్యమంత్రిగా ఏడేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల మన్ననలు అందుకున్న వ్యక్తికి భారతరత్న అనే దేశ అత్యున్నత గౌరవం ఇప్పటిదాకా దక్కలేదు. కేంద్రం గుర్తించడం లేదా? లేకుంటే కావాలనే ఎవరైనా అడ్డుకుంటున్నారా?.. ఈ విషయంలో నారా-నందమూరి కుటుంబాలపై ఆయన అభిమానుల కోపం సరైందేనా?.. 

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ కొత్తదేం కాదు కదా. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ విషయంలో మొదటి నుంచి శ్రద్ధ పెట్టలేదు. ఇటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నందమూరి కుటుంబం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో.. ఆటోమేటిక్‌గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్‌ను సీరియస్‌గా పరిశీలించలేదు. కాబట్టి దీనిపైన చర్చ జరిగిన దాఖలాలు కూడా లేవు. కానీ.. 

నిరుడు నందమూరి తారక రామారావు శతజయంతోత్సవాల టైంలో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ ఎన్టీఆర్‌పై ప్రేమను ఒలకబోస్తూ.. భారతరత్న డిమాండ్‌తో రోడ్డెక్కింది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథిగా ఎన్టీఆర్‌ వంద రూపాయల కాయిన్‌ రిలీజ్‌ చేయించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న ఎన్టీఆర్‌ వారసులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అక్కడా నారావారి రాజకీయాన్ని తెలుగు ప్రజలు చూసిందే. అయితే ఆ వెంటనే ఆమె బీజేపీ ఏపీ చీఫ్‌ కావడంతో ఎన్టీఆర్‌ భారతరత్నకు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని అంతా భావించారు.  కట్‌ చేస్తే..

కేంద్రం తాజాగా బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, జన్‌ నాయక్‌ కర్పూరి ఠాకూర్‌ దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌తో పాటు ఆర్జేడీ చీఫ్‌ లాలూకు.. అలాగే పలువురు రాజకీయ దిగ్గజాలకు కర్పూరి ఠాకూర్‌ రాజకీయ గురువు. ఇక్కడ ఎన్టీఆర్‌తో ఠాకూర్‌కు పోలికలు అప్రస్తుతం. కానీ, ఈ ఇద్దరికీ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలనే డిమాండ్‌ చాలాకాలం నుంచే ఉంది. పైగా నితీశ్‌కు బీజేపీకి కటీఫ్‌ అయ్యి చాలా కాలమే అవుతోంది. రాజకీయంగానూ నిత్యం ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతుంటాయి. అలాంటిది ఠాకూర్‌కు పురస్కారం ఇవ్వడంలో కేంద్రం తనదైన రాజకీయం ప్రదర్శించిందనుకున్నా.. ఎన్టీఆర్‌ విషయంలో ఇవతల నుంచి సరైన ఒత్తిడి కేంద్రంపైకి వెళ్లలేదనే విమర్శే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. 

బీజేపీకి పెద్దగా అభ్యంతరాల్లేవ్‌
ఇటీవలికాలంలో జాతీయ పురస్కారాల గ్రహీతలను పరిశీలిస్తే.. సమాజానికి వాళ్లు పెద్దగా తెలియకపోయినా.. వాళ్లు చేస్తున్న సేవ ఆధారంగా ఎంపిక జరిగినట్లు అర్థమవుతుంది. అదే సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూలురకే ఎక్కువ పురస్కారాలు దక్కుతున్నాయని..అందులోనూ కేంద్రం రాజకీయం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు.. 2019లో బెంగాల్‌ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్ర పతి ప్రణబ్‌ ముఖర్జీకి భారత రత్న ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

ఒకవేళ ఇప్పుడు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తే అడ్డుకునేవారెవరూ ఉండరు. ఎందుకంటే అది బీజేపీకే మైలేజ్‌ ఇచ్చే అంశం. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గానికి బీజేపీ దగ్గరయ్యేందుకు అవకాశం కలుగుతుంది. అంతేకాక.. చంద్రబాబు చేయలేని పని తాము చేశామని చెప్పుకోవచ్చు. అప్పుడు టీడీపీని ఇరుకున పెట్టొచ్చు. ఎన్నికల వేళ ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి మంచి అవకాశమే కదా.  

చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? 

ఎన్టీఆర్‌ తనయ.. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి. సుష్మాస్వరాజ్‌ తర్వాత చిన్నమ్మగా ఆమెకంటూ ఓ ట్యాగ్‌ లైన్‌ క్రియేట్‌ అయ్యింది. కాంగ్రెస్‌ హయాంలో..  కేంద్ర మంత్రిగా ఉన్న టైంలోనూ ఆయన రాజకీయాలు అర్థవంతంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆమె రాజకీయాలను తల్చుకుంటే జాలేస్తోంది. పురంధేశ్వరి బీజేపీలో చేరి తొమ్మిదేళ్లు అవుతోంది. బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తి కావొస్తోంది. ఈ 9 ఏళ్లు, పోనీ చీఫ్‌గా 6 నెలల కాలంలో ఆమె బీజేపీకి విజ్ఞప్తులు చేసినా.. ఆఖరికి ఒత్తిడి చేసినా తన తండ్రికి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలించేదేమో. కానీ, ఆమె ఆ విషయంపై మాత్రం ఎందుకనో శ్రద్ధ పెట్టలేదనే అనిపిస్తోంది. మొక్కుబడి ప్రకటనలకు తప్ప.. ఏనాడూ ఆమె మనసు పెట్టింది లేదనేది స్పష్టం అవుతోంది. ఆమె చేతకానితనం వెనుక మరిది చంద్రబాబు హస్తం ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. 

టీడీపీ దద్దమ్మ.. ఇది తెలిసిందే!
ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడంలో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఎన్టీఆర్ మరణానంతరం.. చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదు. అందుకే ఆయనకు భారతరత్న రాలేదనే ఆరోపణలూ ఉన్నాయి. లేకుంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పిన రోజుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడం పెద్ద సమస్య కాదు కదా. ఇక.. గతంలో వాజ్‌పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న అంశాన్ని పరిశీలించింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందనే చర్చ నడిచింది. ఒకవేళ ఎన్టీఆర్‌కు ఇప్పిస్తే.. తెలుగుదేశం పార్టీ తన సొంతంది కాదనేది .. ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటు రాజకీయం దేశానికి తెలిసిపోతుందన్న భయం ఆయనలో ఉండొచ్చు. అందుకే నందమూరి కుటుంబాన్ని కూడా మొదటి నుంచి తన గుప్పిట ఉంచుకుని అణగదొక్కుతూ వస్తున్నాడు. ఏదైతేనేం..  ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడంలో చంద్రబాబే ప్రధాన భూమిక పోషించాడనేది తేటతెల్లం అవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో నారా-నందమూరి కుటుంబాలపై ఎన్టీఆర్‌ అభిమానుల కోపం సరైంది కాదంటారా?


‘‘ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నారు. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు..  మళ్లీ పురంధేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారు. కానీ, నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు. ఎన్టీఆర్‌కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారు. బీజెపీకి చెబుతున్నా.. పురందేశ్వరి టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తోంది. పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోండి.. ’’

దివంగత నందమూరి తారకరామారావు పేరు మీద 100 రూపాయల స్మారక నాణేం విడుదల కార్యక్రమ సమయంలో ఆయన సతీమణి లక్ష్మీపార్వతి చెప్పిన మాటలు.. 

::లోకీ, సాక్షి డిజిటల్‌ పొలిటికల్‌ డెస్క్‌

whatsapp channel

మరిన్ని వార్తలు