త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. సీఎం మాణిక్‌ సాహా పోటీ అక్కడి నుంచే..

28 Jan, 2023 13:23 IST|Sakshi

అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది అధికార బీజేపీ. మొత్తం 60 స్థానాలకు 48 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసి జాబితా విడుదల చేసింది. మిగతా 12 స్థానాల్లో పోటీ చేసే వారి పేర్లను త్వరలోనే ప్రకటించనుంది. సీఎం మాణిక్ సాహా మరోసారి టౌన్‌ బోర్డోవలి నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. కేంద్రమంత్రి ప్రతిమ భౌమిక్ ధన్‌పుర్ స్థానం నుంచి బరిలోకి దిగుతారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ బనమాలిపుర్ నుంచి పోటీ చేస్తారు.

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైన మరునాడే త్రిపుర అభ్యర్థుల జాబితా విడుదల కావడం గమనార్హం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరగనున్నాయి. మార్చి 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. జనవరి 18నే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 21న ప్రారంభమైంది. జనవరి 30న ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 2వరకు గడువు ఉంది.
చదవండి: బోర్డర్‌లో రెచ్చిపోతున్న చైనా.. నివేదికలో పలు సంచలన అంశాలు

మరిన్ని వార్తలు