TRS: ‘నామినేటెడ్‌’పై చిగురిస్తున్న ఆశలు

20 May, 2021 09:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కు కొత్తగా జరిపిన నియమాకాల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న వారితోపాటు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి చోటు దక్కడంతో నామినేటెడ్‌ పదవులపై ఆశావహుల కన్నుపడింది. ఎమ్మెల్సీతోపాటు ఇతర పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలతోపాటు ఇతర ఔత్సాహికులు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆరేళ్ల పదవీ కాల పరిమితి ఉన్నా కేసీఆర్‌ పిలుపుమేరకు ఏడాదిన్నరకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జర్నలిస్టు ఆర్‌.సత్యనారాయణకు టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా అవకాశం లభించింది.

ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా పని చేసి వివిధ కారణాలతో అవకాశం దక్కని వారికి ఎప్పటికైనా పదవులు వస్తాయనే సంకేతాన్ని ఆర్‌.సత్యనారాయణను నామినేట్‌ చేయడం ద్వారా కేసీఆర్‌ ఇచ్చినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయిని సుమిత్రానంద్‌ తనోబాకు గతంలో అవకాశమిస్తానన్న కేసీఆర్‌.. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకున్నారు. మరోవైపు, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రవీందర్‌రెడ్డి కొంతకాలంగా నామినేటెడ్‌ పదవిని ఆశిస్తుండగా ఇప్పుడు నెరవేరింది. 

పదవుల భర్తీ కోసం ఎదురుచూపు 
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల పాలక మండళ్ల భర్తీ పూర్తి స్థాయిలో జరగలేదు. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లోక్‌సభ ఎన్నికలు మొదలుకుని స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు ఇలా వరుసగా ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. అయితే వచ్చే రెండున్నరేళ్ల పాటు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నికలు లేకపోవడంతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ నామినేటెడ్‌ పదవుల భర్తీపై దృష్టి పెడతారని పార్టీ నేతలు భావిస్తున్నారు.

నేతలు, కేడర్‌లో ఆత్మ విశ్వాసం నింపేందుకు నామినేటెడ్‌ పదవుల భర్తీపై కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మహిళా కమిషన్‌కు కొత్త కార్యవర్గాన్ని నియమించిన కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్, టూరిజం కార్పొరేషన్‌ వంటి వాటికి పార్టీ నేతలను నామినేట్‌ చేశారు. ఎస్టీ, ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్‌తో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ వంటి కీలకమైన కమిషన్‌లు, కార్పొరేషన్లకు పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. గత ఫిబ్రవరి నుంచి పార్టీ కార్యకలాపాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్‌ త్వరలో నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియనూ పూర్తి చేస్తారని అంటున్నారు. 

ఎమ్మెల్సీ పదవులపై కన్ను
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలతో పాటు ఇతర నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న ఔత్సాహికులు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. జూన్‌ 3న శాసన మండలిలో ఖాళీ అవుతున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కోవిడ్‌ కారణంగా ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంతో ఆశావహులు నిరాశలో మునిగిపోయారు.

అయితే ఆగస్టులోగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముందని భావిసున్నారు. మరోవైపు వచ్చే జనవరిలోగా శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో మరో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ అయిన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలోపు 19 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. 
చదవండి: Koti ENT Hospital: బ్లాక్‌ ఫంగస్‌కు మెరుగైన చికిత్స

మరిన్ని వార్తలు