ఎమ్మెల్యేలను చీల్చి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ యత్నం

30 Aug, 2022 07:14 IST|Sakshi

థానే/ముంబై: బీజేపీయేతర రాజకీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌(81) చెప్పారు. అయితే, వయోభారం దృష్ట్యా ఈ విషయంలో ఎలాంటి బాధ్యతను తీసుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. థానేలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు బీజేపీయేతర పారీ్టలను ఏకం చేసే విషయంలో తన సహకారం మాత్రం ఉంటుందన్నారు. 2014 సాధారణ ఎన్నికలు మొదలుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందన్నారు.

‘ప్రతి గృహానికి కరెంటు, నీరు, మరుగుదొడ్లు వంటివి కల్పించడం, గ్రామాలను ఇంటర్నెట్‌తో అనుసంధానించడం వంటి ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు మాత్రం, 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ స్థాయికి తీసుకెళ్తానంటూ కొత్తగా వాగ్దానం చేస్తోంది’అంటూ విమర్శించారు. చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండాగా మారిందన్నారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకు సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ వంటి వాటిని వాడుకుంటోందని చెప్పారు.

‘మహారాష్ట్ర ఎన్‌సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు 110 దాడులు చేశాయంటే మీరు నమ్మగలరా? ఈ కేసులో రూ.100 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత రూ.4.07 కోట్లు, ఇప్పుడు రూ.1.71 కోట్లు మాత్రమేనని అంటున్నారు. నిజాలన్నీ కోర్టులోనే తేలుతాయి’అని పవార్‌ అన్నారు. ‘రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ చేస్తున్న దాడి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైనే తప్ప మరొకటి కాదు. ఇది ఆందోళన కలిగించే అంశం. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను చీల్చి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకు మహారాష్ట్ర తాజా ఉదాహరణ’అని అన్నారు.

తమ తమ పార్టీల తరఫున గట్టిగా మాట్లాడినందుకే ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్, శివసేన నేత సంజయ్‌ రౌత్‌లను మోదీ ప్రభుత్వం జైలుపాలు చేసిందన్నారు. బిలి్కస్‌బానో కేసులో జీవిత ఖైదు పడిన 11 మందిని గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సిగ్గుచేటుగా ఆయన అభివర్ణించారు.
చదవండి: ఏం రాహుల్‌.. ఏం మాట్లాడుతున్నావ్‌.!

మరిన్ని వార్తలు