-

ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్‌

26 Nov, 2023 15:10 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌: యాభై ఏళ్ల పాలనలో తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. ఓటేసే ముందు పార్టీల చరిత్రను గుర్తు తెచ్చుకోవాలని ప్రజానీకాన్ని అభ్యర్థించారాయన.  

‘‘తెలంగాణను బలవంతంగా ఏపీలో కలిపిందే కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయంతో 58 ఏళ్లు గోస పడ్డాం. కాంగ్రెస్‌ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు.  ప్రాణాలు పణంగా పెట్టి 15 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రైతులకు 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నాం. కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొంటున్నాం.

..ఆడబిడ్డలకు కల్యాణ కల్యాణ లక్ష్మి,  షాదీముబాకర్‌లు ఇస్తున్నాం.   గిరిజనుల, ఆదివాసీల ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం.  అన్ని వర్గాల ఆత్మగౌరవం కోసం పని చేశాం. దేశంలో రైతు బంధు పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్‌. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తుందట. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుంది?.కాంగ్రెస్‌ వస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది.

ఈసారి గెలిచాక.. పెన్షన్‌ రూ.5 వేలకు పెంచుతాం. తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తాం. రైతుబంధు రూ.16 వేలకు పెంచుకుందాం అని అన్నారాయన. 

జగిత్యాలలో మాట్లాడుతూ..  
‘‘తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్‌ ఇచ్చింది ఎవరు?. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన ఏంటో ప్రజలకు తెలుసు. ఏం మేలు జరిగిందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి?. ఇందిరమ్మ రాజ్యంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. యువకులను జైల్లో పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం బాగుపడింది?. ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ చీకటి రోజులే కదా.  ఏపీ పాలకుల కంటే కాంగ్రెస్‌ నేతలే తెలంగాణను ఎక్కువ ముంచారు.  ఎవరు నిజమైన సిపాయిలో గుర్తించాలి’’ అని కేసీఆర్‌ జగిత్యాల బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. 

యాభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం చేయలేదు. రైతు బంధు గురించి ఎవరైనా ఆలోచించారా? రైతు బంధు పుట్టించిందే బీఆర్‌ఎస్‌.. కేసీఆర్‌. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. రైతు బంధు ఉండాలా? వద్దా?. కాంగ్రెస్‌ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతారట. ధరణిని ఆపేస్తే.. రైతు బంధు ఎట్లా వస్తది?. ఓటు వేసే ముందు పార్టీ చరిత్ర, అభ్యర్థుల గుణగణాలు చూడాలి అని అన్నారాయన. 

మరిన్ని వార్తలు