-

Samuthirakani: పదహారేళ్ల క్రితం సినిమా వివాదం.. నీకెంత ధైర్యమన్న సముద్రఖని!

26 Nov, 2023 14:17 IST|Sakshi

కోలీవుడ్‌లో కొంతకాలంగా వివాదాల పర్వం నడుస్తోంది. ఇప్పటికే గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవనచ్చితిరం సినిమా రిలీజ్ విషయంలోనూ అదే జరిగింది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజే అభిమానులకు షాక్ తగిలింది. ఈ సినిమా సమస్య కాస్తా కోర్టుకు చేరడంతో మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉండగా తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా 16 ఏళ్ల క్రిత రిలీజైన సినిమా విషయంలో ఇప్పుడు వివాదం మొదలైంది. అదేంటో తెలుసుకుందాం. 

కోలీవుడ్ నటుడు, నిర్మాత సముద్రఖని మరో నిర్మాత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కార్తి నటించిన చిత్రం ‘పరుత్తివీరన్‌’. ఈ చిత్రం ద్వారానే కార్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.  ఈ సినిమా వివాదంపై సముద్రఖని మండిపడ్డారు. అయితే ఈ సినిమా విషయంలో కొన్నిరోజులుగా దర్శకుడు ఆమిర్‌, నిర్మాత జ్ఞానవేల్‌ రాజా మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పరుత్తివీరన్ దర్శకుడికి మద్దతుగా సముద్రఖని ఓ లేఖ విడుదల చేశారు.

సముద్ర ఖని లేఖలో ప్రస్తావిస్తూ.. 'పరుత్తివీరన్‌లో నేను కూడా నటించా. ఆ సినిమా టైంలో డైరెక్టర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. నిర్మాతగా ఒక్కరోజు కూడా జ్ఞానవేల్ సెట్‌కు రాలేదు. సినిమా బడ్జెట్‌ విషయంలోనూ డైరెక్టర్‌కు సహకరించలేదు. నా వద్ద డబ్బుల్లేవంటూ షూటింగ్‌ మధ్యలోనే చేతులెత్తేశావు. బంధువుల దగ్గర నుంచి అప్పులు చేసి మరీ ఆమిర్‌ షూటింగ్ పూర్తి చేశాడు. దీనికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎంతో కష్టపడి సినిమా తీస్తే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈ రోజు నువ్వు అమిర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నావు. ఈ పద్ధతితేం బాగాలేదు. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.' అని సముద్రఖని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. 

అసలేం జరిగిందంటే..

ఇటీవలే కార్తి హీరోగా నటించిన చిత్రం ‘జపాన్‌’. ఈ సినిమాకు జ్ఞానవేల్‌ రాజా దీనికి నిర్మాతగా వ్యవహరించారు. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కార్తితో ఇప్పటివరకూ సినిమాలు చేసిన దర్శకులందరూ హాజరయ్యారు. అయితే ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆమిర్‌ మాత్రం ఈవెంట్‌కు రాలేదు. దీనిపై ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కార్తి జపాన్ మూవీ ఈవెంట్‌కు నాకు ఆహ్వానం అందలేదు. సూర్య - కార్తితో నాకు రిలేషన్స్ అంత బాగాలేవు.. జ్ఞానవేల్‌ వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అమిర్ అన్నారు.

అయితే అమిర్ వ్యాఖ్యలపై జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ.. 'అమిర్‌కు ఆహ్వానం పంపించాం. పరుత్తివీరన్‌ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చెప్పకుండా డబ్బులు దండుకున్నాడు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీంతో వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.  

మరిన్ని వార్తలు