పువ్వాడ అజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశా: తుమ్మల

13 Nov, 2023 14:37 IST|Sakshi

సాక్షి,ఖమ్మం : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అఫిడవిట్‌ నిబంధనలకు అనుగుణంగా లేదని ఖమ్మం నియోజకవర్గ  కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అఫిడవిట్‌కు సంబంధించి ఫార్మాట్‌ మార్చడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం ఖమ్మంలో తుమ్మల ఈ విషయమై మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పువ్వాడ అఫిడవిట్‌ ఫార్మాట్‌ మార్పుపై ఇప్పటికే రిటర్నింగ్‌ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాను. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోని  రిటర్నింగ్ అధికారి తీరుపై కోర్టుకు వెళతానని తెలిపారు. పువ్వాడ తన అఫిడవిట్‌లో డిపెండెంట్ కాలమ్ మార్చారు. డిపెండెంట్ కాలమ్‌లో ఎవరూ లేకపోతే నిల్ అని రాయాల్సి ఉంది. కానీ అలా రాయలేదు. 

పువ్వాడ నాలుగు సెట్స్ నామినేషన్లలో తప్పులున్నాయి. ఈసీ ఫార్మాట్‌లో అఫిడవిట్‌ లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగా. రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల నిబంధనలు పాటించలేదు. ఆ అధికారిపై పై న్యాయ పోరాటం చేస్తా’అని తుమ్మల తెలిపారు. 

రాష్ట్రమంతా ఓ పక్క...ఖమ్మం ఓ పక్క 

మీడియా సమావేశం అనంతరం తుమ్మల ఖమ్మం నియోజకవర్గ కాంగగ్రెస్‌ పార్టీ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా రాజకీయ జీవితంలో ఇంత రసవత్తర పోటీ, ఇంత కసి, పట్టుదల ఉన్నఎన్నికలు చూడలేదు. రాష్ట్రమంత ఓ పక్క ఖమ్మం జిల్లా ఓ పక్క. పొరుగు రాష్ట్రం భీమవరంలో ఖమ్మం ఎన్నికలపై పందాలు కాస్తున్నారు. పందాలు మంచి సంస్కృతి కాదు. కానీ వందల కోట్ల పందాలు కాస్తున్నారంటేనే బీఆర్‌ఎస్‌ పనైపోయిందని అర్థమవుతోంది.

ఖమ్మం ,పాలేరుపై వందల కోట్లు కుమ్మరించి నాయకులను అధికార పార్టీ కొనుగోలు చేస్తోంది. నన్ను, పొంగులేటిని ఓడించాలని అధికార యంత్రాంగాన్ని వాడుతున్నారు. మీ అరాచకాలన్నింటికీ  చక్ర వడ్డీ తో సహా తిరిగి చెల్లిస్తాం. ఖమ్మం పౌరుషాల గడ్డ...40 ఏళ్ల రాజకీయ జీవితంలో మీ పరువు ప్రతిష్ట కోసం పనిచేశా. మత విద్వేషాలు లేకుండా భారత్ జోడో యాత్రతో  దేశాన్ని ఐక్యం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతుగా నిలవాలి. నాకు మద్దతుగా నిలిచిన తెలుగుదేశం శ్రేణులకు ధన్య వాదాలు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో వర్కింగ్ ప్రెసిడెంట్‌కి తెలుసు’ అని తుమ్మల అన్నారు.   

ఇదీ చదవండి..మెదక్‌లో మళ్లీ పాత యుద్ధం.. పద్మాదేవేందర్‌రెడ్డి వర్సెస్‌ మైనంపల్లి 

మరిన్ని వార్తలు