ఇదో రకం వింత ఎన్నికల ప్రచారం

10 Apr, 2021 15:03 IST|Sakshi

లక్నో‌: రాజకీయ నాయకులు గెలుపు కోసం ఎలాంటి హామీలైనా ఇస్తారని తెలుసు. కానీ, ఇప్పుడు ప్రచారానికి దేన్నైనా వాడేస్తారని నిరూపించారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాజకీయనేతలు. వారు తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు మూగజీవాలను కూడా వాడేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రాయ్ బరేలీ, బాలియా నియోజకవర్గాల అభ్యర్థులు వింత పోకడలకి పోయారు. అక్కడి వీధి కుక్కలకి తమ ప్రచార పోస్టర్లు అంటించారు. తమకే ఓటు వెయ్యాలని ఆ పోస్టర్లపై కోరారు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు వారిపై ఫైర్ అయ్యారు. 

జంతు కార్యకర్త అయిన రీనా మిశ్రా మాట్లాడుతూ ‘ఎన్నికల సమయంలో ఇలాంటి స్టిక్కర్లు మనుషుల ముఖం మీద అంటించుకోమంటే ఎవరైనా అలా చేస్తారా?.. నోరు లేని జీవాలను ఈ విధంగా వాడుకోవడం సరికాదని’ మండిపడ్డారు. తక్షణమే పోలీసులు స్పందించి పోస్టర్లు అంటించిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విమర్శలను అభ్యర్థులు తోసిపుచ్చుతున్నారు. ప్రచారంలో జంతువులను ఉపయోగించరాదనే ఎటువంటి నియమం లేదు. అయినా మేము జంతువులకు ఏ విధంగానూ హాని చేయటం లేదు. వాటికి ఆహారం పెట్టి, పోస్టర్లను అంటిస్తున్నాం. ఇందులో తప్పేముందని, తమ పనిని వారు సమర్థించుకుంటున్నారు.

( చదవండి: మద్యాన్ని జుర్రుకున్న కోతులు! )

మరిన్ని వార్తలు