రెండో లిస్ట్‌లో అయినా గడ్కరీ పేరు ఉంటుందా? ఫడ్నవిస్ ఏం చెప్పారంటే..

8 Mar, 2024 18:03 IST|Sakshi

Nitin Gadkari : మహారాష్ట్రలో అధికార కూటమి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం ఒప్పందం కుదిరిన తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు మొదటి స్థానంలో ఉంటుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేరు లేకపోవడం తెలిసిందే.

నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడుతూ..  శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రతిపక్షాల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నుండి గడ్కరీకి లోక్‌సభ టిక్కెట్‌ను ఆఫర్ చేయడంపై విరుచుకుపడ్డారు. 

"గడ్కరీ మా ప్రముఖ నాయకుడు. ఆయన నాగ్‌పూర్ నుండి పోటీ చేస్తారు. అభ్యర్థుల (బీజేపీ) మొదటి జాబితా విడుదలైనప్పుడు మహాయుతి భాగస్వాముల మధ్య (బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ)  చర్చలు జరగలేదు.  ఈ చర్చలు పూర్తవ్వగానే గడ్కరీ పేరే ముందుగా (అభ్యర్థుల జాబితాలో) వస్తుంది" అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

"ఉద్ధవ్ థాకరే సొంత పార్టీనే చితికిపోయింది. గడ్కరీ వంటి జాతీయ స్థాయి నాయకుడికి అటువంటి పార్టీ అధినేత ఆఫర్ ఇవ్వడం అనేది స్థాయిలేని వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవిని ఆఫర్ చేయడం లాంటిది" అన్నారు. కాగా గురువారం జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ నితిన్ గడ్కరీ మహారాష్ట్ర పౌరుషాన్ని చూపించాలని, ఢిల్లీ ముందు తల వంచేందుకు బదులుగా రాజీనామా చేయాలని అన్నారు. తాము ఆయన్ను ఎంవీఏ తరఫున అభ్యర్థిగా ఎన్నుకుంటామని థాకరే చెప్పారు.

Election 2024

మరిన్ని వార్తలు