Premalu Review In Telugu: 'ప్రేమలు' మూవీ రివ్యూ

8 Mar, 2024 06:51 IST|Sakshi
Rating:  

సంక్రాంతి తర్వాత తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రాలేదు. వచ్చిన వాటిలో ఒకటి రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి గానీ మరీ అంత హిట్ కాలేదు. మరోవైపు మలయాళంలో రీసెంట్‌గా వరసపెట్టి మూవీస్ ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. అందులో ఒకటే 'ప్రేమలు'. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ మలయాళ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఇది ఎలా ఉందో ఈ రివ్యూ‌లో చూసేద్దాం.

కథేంటి?
సచిన్(నస్లేన్) ఇంజనీరింగ్ పూర్తిచేసిన కుర్రాడు. యూకే వెళ్ళాలనేది ప్లాన్. వీసా రిజెక్ట్ అవ్వడంతో, ఇంట్లో ఉండటానికి ఇబ్బంది పడుతుంటాడు. అదే టైంలో ఫ్రెండ్ అమూల్ (సంగీత్ ప్రతాప్) చెప్పడంతో ఇద్దరు కలిసి గేట్(GATE) కోచింగ్ కోసం హైదరాబాద్‌కి వస్తారు. ఓ పెళ్ళిలో రీను(మమిత బైజు)ని చూసి సచిన్ ఇష్టపడతాడు. అనుకోకుండా వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమ విషయాన్ని రీనుకి సచిన్ చెప్పేస్తాడు. కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. మరి ఈ ప్రేమకథ కంచికి చేరిందా? చివరకు ఏమైందనేదే 'ప్రేమలు' స్టోరీ.

ఎలా ఉంది? 
ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే కథే ఉండాలా ఏంటి? అవును ఈ మూవీలో కథ గిదా ఏం ఉండదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అబ్బాయి, సాప్ట్‌వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి.. అస్సలు పరిచయం లేని ఈ ఇద్దరూ లవ్‌లో పడితే ఏమైందనేదే 'ప్రేమలు'. చెప్పుకుంటే ఓస్ ఇంతేనా అన్నట్టు వుంటది గానీ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఇది మాత్రం గ్యారంటీ. 

తెలిసిన కథల్ని, అదీ ప్రేమ కథల్ని చెప్పడం కత్తి మీద సాము. కానీ 'ప్రేమలు' డైరెక్టర్ చాలా తెలివిగా స్టోరీ కంటే ఫన్నీ సీన్స్‌తో ఆడియెన్స్‌ని నవ్వించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సచిన్, రీనూ పాత్రలకు యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఆయా పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. అమాయకత్వం, లేత లేత ప్రేమ.. వీటితో పాటు ఈ సినిమాలో చూపించిన హైదరాబాద్ అందాలకు ఇంకా ఫిదా అయిపోతారు. ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, మైండ్ స్పేస్, చార్మినార్, ఖజాగుడా లేక్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్.. ఇలా హైదరాబాద్‌లో ఉన్న చాలా ప్రదేశాల్ని అంతే అందంగా చూపించారు.

తెలుగు డబ్బింగ్‌కి వచ్చేసరికి.. ఫేమస్ కుమారి ఆంటీ దగ్గర నుంచి బిగ్‌బాస్ ఫేమ్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రతీ డైలాగ్‌ని వాడేశారు. వన్ లైనర్స్, పంచ్‌లు భలే పేలాయి. సందర్భానికి తగ్గట్టు వచ్చే కామెడీ అయితే వేరే లెవెల్. కథ కావాలి అని వెళ్తే ఈ మూవీ నచ్చదు. అలానే రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో వచ్చే చూడకపోయినా సరే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అర్థం కావు. 'ప్రేమలు' మైనస్సుల విషయానికొస్తే.. ఇది యూత్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి స్పేస్ లేదు.  తెలుగు వెర్షన్ వచ్చేసరికి ఊరి పేర్ల విషయంలో ఒకటి రెండు సీన్లలో కన్ఫ్యూజ్ చేశారు. సో మీ గ్యాంగ్‌తో అయినా సింగిల్‌గా అయినా రెండున్నర గంటలు నవ్వుతూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో అండ్ వాచ్ 'ప్రేమలు'.

ఎవరెలా చేశారు?
సచిన్ పాత్రలో నస్లేన్.. చాలా బాగా చేశాడు. అమాయకత్వం, ప్రేమ, బిడియం, బాధ.. ఇలా అన్ని ఎమోషన్స్‌ని పండించాడు. రీనుగా చేసిన మమిత అయితే చాలా క్యూట్‌నెస్‌తో తనతో ప్రేమలో పడిపోయేలా చేసింది. ఈమె స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారీ ఈమెని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈమె హెయిర్ స్టైల్, డ్రెస్సెస్ కూడా భలే ఉన్నాయి. హీరో ఫ్రెండ్ అమూల్‌గా చేసిన సంగీత్ ప్రతాప్‌ని చూస్తే మనకు ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. హీరోయిన్ ని ప్రేమిస్తూ, ఆమెతో పాటు కలిసి పనిచేసే ఆది పాత్రలో చేసిన శ్యామ్ మోహన్.. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌ కామెడీతో కేక పుట్టించాడు. మిగతా వాళ్ళు ఉన్నంతలో బాగా చేశారు. 

టెక్నికల్ విషయాలకు వస్తే ఫస్ట్ డైరెక్టర్ గిరీష్‌ని మెచ్చుకోవాలి. క్యూట్ క్యూట్ ప్రేమకథను అంతే క్యూట్‌గా తీశారు. సాధారణంగా మలయాళ సినిమాలంటే అక్కడే ఉంటాయి. కానీ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకుని ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్ అజ్మల్ సభు.. హైదరాబాద్‌ని రోజూ చూసే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనేంత అందంగా చూపించాడు. విష్ణు విజయ్ పాటలు కథలో కలిసిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీకి తగ్గట్లే ఉంది. ఓవరాల్‍‌గా చెప్పుకుంటే 'ప్రేమలు'.. మీ మనసు దోచే పెర్ఫెక్ట్ సినిమా.

- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

Rating:  
(2.75/5)

Election 2024

మరిన్ని వార్తలు