ఇంటి నుంచి ఓటింగ్‌కు మైక్రో అబ్జర్వర్లు

16 Nov, 2023 06:04 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
● జిల్లాలో 14 బృందాలు ● క్షేత్రస్థాయిలో 21 నుంచి 25వ తేదీ వరకు ఓటింగ్‌ ● కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికి మించి వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు ఆమోదించారని, వారి వివరాలను అన్ని రాజకీయ పార్టీలకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేస్తామని అన్నారు. ఇంటి నుంచి ఓటింగ్‌ నిర్వహణకు మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని వెల్లడించారు. ఒక్క పోలీస్‌ అధికారితో పాటు, పోలింగ్‌ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి ఓటింగ్‌ ఈనెల 21వ తేదీ నుంచి నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతిన నిర్వహించే ఎన్నికలను రహస్య విధానంలోనే ఓటు వేస్తారని తెలిపారు. ఇప్పటికే బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ ద్వారా వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు సమాచారం అందించామని అన్నారు. వారు ఆయా గ్రామాలను ఏ రోజున సందర్శిస్తారనేది షెడ్యూల్‌ వివరంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఇంటిలో ఉండి వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్‌ ఏజెంట్లని అనుమతిస్తామని, వీడియోగ్రఫీ చేస్తామన్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలన్నారు. ఇప్పటికే రెండు కంపెనీల బీఎస్‌ఎఫ్‌ బలగాలు జిల్లాకు వచ్చాయని, మరో నాలుగు కంపెనీ బలగాలు వస్తాయని వివరించారు. ఒక్కో మండలానికి ఇన్‌ప్పెక్టర్‌ స్థాయి అధికారిని నియమించామని అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపాఉ. ఈ సమావేశంలో డీపీఆర్వో ఎం.దశరథం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు