ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు | Sakshi
Sakshi News home page

ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు

Published Thu, Nov 16 2023 6:04 AM

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ప్రియాంక - Sakshi

తిరుమలగిరి (తుంగతుర్తి): ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ వెంకట్రావు కోరారు. బుధవారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులతో మాట్లాడారు. ఓటు విలువ తెలుసుకొని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని కోరారు. ఆయన వెంట ఎస్పీ రాహుల్‌ హెగ్డే, తహసీల్దార్‌ రమణారెడ్డి ఉన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

నాగారం: శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ వెంకట్రావ్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. మంగళవారం నాగారం మండల పరిధిలోని సమస్యత్మాక ప్రాంతమైన వర్ధమానుకోటలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్‌ బ్రహ్మయ్య, సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ సైదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఓటు వజ్రాయుధం

సూర్యాపేటటౌన్‌ : ప్రజల చేతిలో ఓటు వజ్రాయుధమని, సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని అదనపు కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఓటరు చైతన్య సదస్సులో ఆమె మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ పబ్లిసిటీ అధికారి కోటేశ్వర్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేషులు, గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సునీల, శర్మ, కవిత, అరుణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయికి

ఫుట్‌బాల్‌ క్రీడాకారులు

నడిగూడెం: మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం ఉమ్మడి జిల్లా స్థాయి నుంచి అండర్‌–14 విభాగంలో క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం మండల విద్యాధికారి ఎండీ సలీం షరీఫ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా 23 మంది బాలురు, 18 మంది బాలికలను ఎంపిక చేశారు. వీరు 16వ తేదీ నుంచి గద్వాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ ధనవిజయలక్ష్మి, వ్యాయామ అధ్యాపకులు గడ్డం వెంకటేశ్వర్లు, పాతకొట్ల ప్రకాష్‌, ఉమ్మడి జిల్లా క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

దురాజ్‌పల్లి (సూర్యాపేట): మేళ్లచెరువు మండలం నల్లబండగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్‌కే నాగుల్‌మీరా సస్పెండ్‌ అయ్యారు. 120/89 పోలింగ్‌ కేంద్రంలో సరైన వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కార్యదర్శిని సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ వెంకట్రావ్‌ బుధవారం తెలిపారు.

తిరుమలగిరి: గ్రామస్తులతో 
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు
1/1

తిరుమలగిరి: గ్రామస్తులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

Advertisement
Advertisement