TS Election 2023: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా..

20 Oct, 2023 08:16 IST|Sakshi

ఇష్టానుసారంగా డబ్బు సీజ్‌ చేస్తున్న పోలీసులు..

ఉన్నతాధికారుల మెప్పు కోసమేనా..!

కానిస్టేబుళ్ల తీరుతో ప్రజలకు ఇబ్బందులు

మెదక్‌: ఎన్నికల నియమావళిని అడ్డుపెట్టుకొని కొందరు కిందిస్థాయి పోలీస్‌ సిబ్బంది చేస్తున్న పనులకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న డబ్బును పోలీసులు సీజ్‌ చేసి కలెక్టరేట్‌కు తరలిస్తున్నారు.

ఇదే అదునుగా కొందరు పోలీసులు ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం బ్యాంక్‌ల వద్ద రైతులు, సామాన్య ప్రజల డబ్బులు సీజ్‌ చేస్తున్నారు. సివిల్‌ డ్రెస్‌లో మాటువేసి డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తున్న వారిని పట్టుకొని ఎలాంటి ఆధారాలు లేవని పట్టుకెళ్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఆ డబ్బును తెచ్చుకోవడానికి రోజుల తరబడి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు.

'శివ్వంపేట మండలం గుండ్లపల్లికి చెందిన రాజశేఖర్‌రెడ్డి, శ్రావణ్‌, జీవన్‌రెడ్డి ముగ్గురు స్నేహితులు. వీరిలో రాజశేఖర్‌రెడ్డి, శ్రావణ్‌ ఫౌల్ట్రీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి డబ్బులు అవసరం ఉండి అదే గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి అనే మిత్రుడి వద్ద రూ. లక్ష అప్పు అడిగారు. ఈనెల 17న జీవన్‌రెడ్డి శివ్వంపేట మండలంలోని శభాష్‌పల్లిలోని ఐసీఐసీ బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసి అందులో నుంచి శ్రావణ్‌, రాజశేఖర్‌రెడ్డికి చెరో రూ. 50 వేల చొప్పున ఇచ్చాడు.

ఈ క్రమంలో అప్పటికే బ్యాంకు వద్ద మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్‌ వీరిని గమనించి సమాచారం ఉన్నతాధికారులు తెలిపారు. శ్రావణ్‌, రాజశేఖర్‌రెడ్డిలు కారులో వెళ్తుండగా వారిని ఆపి చెక్‌ చేయగా ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష ఉన్నాయి. వెంటనే నగదును సీజ్‌ చేసి, వారిపై కేసు నమోదు చేసి ఎన్నికల గ్రీవెన్స్‌ కమిటీకి పంపించారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల చొప్పునే ఉంది కదా అని అడిగితే ఇద్దరూ కారులోనే వెళ్తున్నారు కదా అని పోలీసులు బదులిస్తున్నారు. ఆ డబ్బు కోసం నాలుగు రోజులుగా మెదక్‌ కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.'

ఓచర్‌ రాసిందే కానిస్టేబుల్‌..
శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్‌ గ్రామానికి చెందిన నాగయ్య అనే రైతు ఈ నెల 17న రూ.70 వేలకు పాడిగేదెను కొనుగోలు చేశారు. వాటి డబ్బులు కట్టేందుకు ఈనెల 17న శివ్వంపేటలోని ఏపీజీవీబీ బ్యాంక్‌కు వచ్చి తన అకౌంట్‌లో ఉన్న రూ.1.49 లక్షలను డ్రా చేయాలని కోరగా, అక్కడే మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్‌ ఓచర్‌ను నింపి సదరు రైతుకు ఇచ్చింది.

రైతు డబ్బులు డ్రా చేసుకొని బయటకి రాగానే అప్పటికే యూనిఫామ్‌లో ఉన్న లేడీ కానిస్టేబుల్‌ ఇతర సిబ్బందితో కలిసి రైతును పట్టుకొని నగదును సీజ్‌ చేసింది. వాటిని మెదక్‌లోని గ్రీవెన్స్‌ కమిటీకి పంపించారు. ఆ రైతు నాలుగు రోజులుగా డబ్బుల కోసం తిరుగుతున్నారు. ఇలా పోలీసుల అతిమూలంగా సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

మెప్పు కోసం.. తప్పు!
ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబాలకు గురిచేయకుండా అవినీతిపరుల డబ్బు, మద్యం, ఇతర కానుకలను సీజ్‌ చేయాలి. కానీ, అమాయకులైన వారిని పట్టుకొని డబ్బును సీజ్‌ చేయడం సరికాదు. అధికారుల మెప్పు పొందడం కోసం ఇలా చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఓచర్‌ రాసిచ్చి.. డబ్బు పట్టించింది..
నేను రూ.70 వేలు పెట్టి గేదెను కొన్నాను. బ్యాంకులో సివిల్‌ డ్రెస్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ రూ.1.49 లక్షలకు సంబంధించిన ఓచర్‌ రాసి ఇచ్చింది. బయటకు రాగానే పట్టిచ్చింది. డబ్బుల కోసం నాలుగు రోజుల నుంచి కలెక్టరేట్‌కు తిరుగుతున్నాను. ఈ రోజు రేపు ఇస్తామని అధికారులు తిప్పుతున్నారు. – నాగయ్య, రైతు ఎదుల్లాపూర్‌

బ్యాంకుల్లో ఉండాలనే నిబంధన లేదు..
పోలీసులు బ్యాంకుల్లో మఫ్టీలో ఉండాలనే నిబంధన లేదు. ఆధారాలు లేకుండా రూ. 50 వేల కన్న ఎక్కువ తరలిస్తే పోలీసులు పట్టుకుంటారు. ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం కానిస్టేబుల్స్‌ ఇలాంటి పని చేస్తే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. – అదనపు ఎస్పీ మహేందర్‌

మరిన్ని వార్తలు