WC 2023: 20 ఏళ్ల తర్వాత ఆసీస్‌తో ఫైనల్‌ పోరు.. టీమిండియా బదులు తీర్చుకుంటుందా?

17 Nov, 2023 16:36 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో తుది సమరానికి సమయం అసన్నమైంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

ఈ ఫైనల్‌ పోరులో కంగారూలను చిత్తు చేసి 2003 వరల్డ్‌కప్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఎలాగైనా టీమిండియాను ఓడించి ఆరోసారి వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలవాలని వ్యూహాలు రచిస్తోంది.

 కాగా ఇప్పటివరకు వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు ఒకే ఒకసారి తలపడ్డాయి. వన్డే వరల్డ్‌కప్‌ 2003లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఫైనల్లో టీమిండియా- ఆసీస్‌ జట్లు పోటీ పడ్డాయి.

వరల్డ్‌కప్‌ 2003 ఫైనల్లో ఏం జరిగిందంటే?
వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ  స్కోర్‌ సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(140 నాటౌట్‌) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.

పాంటింగ్‌తో పాటు డామియన్ మార్టిన్(88 నాటౌట్‌), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌(57) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గ​ంగూలీ ఏకంగా 8 మంది బౌలర్లు ఊపయోగించినప్పటికీ.. ఆసీస్‌ జోరును ఆపలేకపోయాడు.. హర్భజన్ సింగ్‌ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. స్టార్‌ బౌలర్‌ జవగాల్‌ శ్రీనాథ్‌ అయితే ఏకంగా 87 పరుగులు సమర్పించుకున్నాడు.

వీరేంద్రడి మెరుపులు..
అనంతరం 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఔట్‌ చేశాడు. అయినప్పటికీ మరో డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ప్రతర్ధి బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.  కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం సెహ్వాగ్ చేశాడు.

అయితే వరుస క్రమంలో సౌరవ్‌ గంగూలీ (24), మహ్మద్‌ కైఫ్‌ వికెట్లను భారత్‌తో కోల్పోవడంతో మళ్లీ కష్టాల్లో పడింది. ఆ తర్వాత సెహ్వాగ్, రాహుల్‌ ద్రవిడ్ తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌పై మళ్లీ ఆశలు రేపారు. కానీ 82 పరుగులతో అద్బుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న సెహ్వాగ్‌.. లెహామన్‌ సంచలన త్రోకు రనౌటయ్యాడు.  దీంతో భారత్‌ మళ్లీ కష్టాల్లో పడింది.

అయితే సెహ్వాగ్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌, అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న రాహుల్‌ ద్రవిడ్‌ ఏమైనా అద్బుతాలు చేస్తారని అంతా భావించారు. కానీ ద్రవిడ్‌ను ఆండీ బిచెల్‌ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు.

వెంటనే యువరాజ్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్‌ అభిమానుల భారత్‌ అభిమానుల వరల్డ్‌కప్‌ ఆశలు ఆవిరయ్యాయి. చివరికి 234 పరుగులకే ఆలౌటైన భారత్‌.. 125 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్‌ బౌలర్లలో మెక్‌గ్రాత్‌ 3 వికెట్లతో దెబ్బతీయగా.. సైమెండ్స్‌, బ్రెట్‌ లీ రెండు, బిచెల్‌, హాగ్‌ తలా వికెట్‌ సాధించారు. భారత బ్యాటర్లో  సెహ్వాగ్‌ 81 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.


 

మరిన్ని వార్తలు